తారకరాముడికే గులాబీ పగ్గాలు
హైదరాబాద్, మే 14, (వాయిస్ టుడే )
The pink reins of Tarakaramudi
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలలో భారత రాష్ట్ర సమితి ఒకటి. ఇది రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారాన్ని చలాయించింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు.. భారత రాష్ట్ర సమితి కి అధ్యక్షుడిగా కేసీఆర్ కొనసాగారు. అధికారం పోయిన తర్వాత కూడా ఆయన అదే స్థానంలోనే ఉన్నారు. ఇక ఆయన కుమారుడు కేటీఆర్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. పేరుకు కార్యనిర్వాహక అధ్యక్షుడైనా సరే.. ఇప్పటికీ పార్టీలో పెత్తనం మొత్తం కేటీఆర్ దే. కొన్ని విషయాలు మినహా.. అన్నింటిలోనూ కేటీఆర్ దే పెత్తనం సాగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై భారత రాష్ట్ర సమితి కీలక నాయకుడు కూడా ఎస్ అనే సమాధానమే చెబుతున్నారు. అయితే కెసిఆర్ కేటీఆర్ ను ఎప్పుడు పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు? అనే ప్రశ్నకు మాత్రం ఇంతవరకు సమాధానం లభించడం లేదు.కేటీఆర్ ఒకవేళ పార్టీ ప్రెసిడెంట్ అయితే.. హరీష్ రావు పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే దీనిపై స్వయంగా హరీష్ రావే క్లారిటీ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితిలో కేటీఆర్ కంటే సీనియర్ నాయకుడు హరీష్ రావు. కేటీఆర్ కంటే కూడా మొదటి నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే కేటీఆర్ భారత రాష్ట్ర సమితిలో చేరారో.. అప్పట్నుంచి హరీష్ రావుకు సమాంతర నాయకుడిగా ఎదగడం మొదలుపెట్టారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కీలక శాఖలకు మంత్రిగారి పని చేశారు. ఒకరకంగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. అయితే అప్పట్లో అనేక సందర్భాల్లో పార్టీలో విభేదాలు చోటుచేసుకున్నాయని.. హరీష్ రావు వేరు కుంపటి పెడుతున్నారని ఆరోపణలు వినిపించాయి. అయితే దానిని హరీష్ రావు నిర్ద్వంద్వంగా కొట్టి పారేశారు. అయితే ఇప్పుడు మరోసారి హరీష్ రావు విలేకరులకు ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు..” కెసిఆర్ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది లేదు. కేటీఆర్ ను అధ్యక్షుడిని చేస్తే నాకు వచ్చిన నష్టం లేదు. కెసిఆర్ మాటే నాకు శిరోధార్యం. పార్టీలో ఆయన ఎలాంటి పని చేయమన్నా నేను చేస్తాను. పార్టీలో విభేదాలు ఉన్నాయనేది అబద్ధం. ఇలాంటి ప్రచారం ఎప్పటినుంచో సాగుతోంది. ఇలాంటి ప్రచారాలను చూసుకుంటూనే అధికారంలోకి వచ్చాం. ఏకంగా రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాం. ఇలాంటి వాటిని వినడం మాకు కొత్త కాదు. పార్టీ మొత్తానికి కెసిఆర్ బాస్. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పని చేయడానికి నేను సిద్ధమని” హరీష్ రావు స్పష్టం చేశారు. మొత్తంగా ఆయన పార్టీలో విభేదాలు లేవని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జరగాల్సిన ప్రచారం జరుగుతూనే ఉంది.