చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ నియంత్రించిన పోలీస్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. తిరువారూర్ నగర శాంతిభద్రతల విభాగంలో మణికంఠన్ పని చేస్తున్నారు. విధులు ముగించుకొని భార్య, బిడ్డతో ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు ద్విచక్రవాహనంలో విలామల్ ప్రాంతంలో వస్తున్నారు. అక్కడ వాహనాల రద్దీ అధికమవడంతో చోదకులు ఎటూ వెళ్లే వీల్లేక ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ విధుల్లో లేరు. పరిస్థితి గమనించిన మణికంఠన్ చేతిలో చంటిబిడ్డతోనే నడిరోడ్డుపై నిల్చొని వాహనాలను ఒకటి తర్వాత మరొకటి పంపుతూ ట్రాఫిక్ సరిచేశారు. చేతిలో బిడ్డను పట్టుకొని రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ మణికంఠన్ విధులు నిర్వహించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మణికంఠన్‌ని ఎస్పీ అభినందించి బహుమతి అందించారు.



