2 కోట్లకు చేరనున్న హైదరాబాద్ జనాభా
7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల విలీనం
హైదరాబాద్, మార్చి 2
హైదరాబాద్ లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను.. హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఆవిష్కరించేందుకు సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర రాజధాని శివారును ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని నిర్దేశించారు. HMDA పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు కసరత్తు చేయాలని సూచించారు. అన్ని ప్రాంతాలను ఒకేసారి అభివృద్ధి చేసేందుకు విలీనం ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 150 డివిజన్లు ఉన్నాయి. కోటికి పైగా జనాభా ఉంది. 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో దాదాపు 60 లక్షల మంది వరకూ జనాభా ఉంటుందని అంచనా. విలీనం తర్వాత జనాభా 1.80 కోట్ల నుంచి 2 కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు వేస్తున్నారు. విలీన ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఒకటిగా ఏర్పాటు చేయాలా.? లేక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం ఇలా వేర్వేరుగా 4 సిటీ కార్పొరేషన్లుగా విభజించాలా.? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కాగా, హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించాలని ఇటీవల సమీక్షలో నిర్దేశించారు. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని డివిజన్లలో లక్ష మందికి పైగా జనాభా ఉంటే, మరికొన్ని కార్పొరేషన్లలో డివిజన్లలో 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధి ఒకే తీరుగా జరుగుతుందనేది అధికారుల అంచనా. నగర విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర వాటి కోసం భారీగా నిధులు వెచ్చించాలని వారు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లకు జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయాలని.. దీనిపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దాదాపు సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని.. నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై అధ్యయనం చేయాలని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందట అక్కడి 3 మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్ గా విలీనం చేసింది. అక్కడ అనుసరించిన విధానాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తైన వెంటనే వాటికి ప్రత్యేకాధికారులను నియమించాలని, అన్నింటి పదవీ కాలం ముగిసిన తర్వాతే ఈ విలీన ప్రక్రియ ప్రారంభించాలని సీఎం రేవంత్ అధికారులతో సమాలోచనలు చేశారు. జీహెచ్ఎంసీతో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ్ పేట, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వాటితో పాటు 30 మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. వాటి పాలకవర్గాల పదవీ కాలం మరో ఏడాది ఉంది. ఆ తర్వాతే ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.
2 కోట్లకు చేరనున్న హైదరాబాద్ జనాభా
- Advertisement -
- Advertisement -