బుగ్గారం గత పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన విడిసి
జగిత్యాల,
జిల్లా లోని బుగ్గారం గ్రామ పంచాయతీ లో పని చేసిన గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సాయంత్రం బుగ్గారం గ్రామ అభివృద్ది కమిటి అధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విడిసి కార్యవర్గం, సభ్యులు, గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు, ఇతర ఉన్నతాధికరులకు, ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జి.పి.లో నిధుల దుర్వినియోగం కావడం, రికార్డులు అధికారులకు అందజేయక పోవడం, షోకాజ్ నోటీసులకు తగు సంజాయిషీ ఇవ్వక పోవడం కారణంగా గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను ప్రస్తుత జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మంగళ వారం సస్పెండ్ చేయడం జరిగిందని ఉద్యమ కారుడైన విడిసి కోర్ కమిటి చైర్మన్ చుక్క గంగారెడ్డి వివరించారు. అలాగే జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ సర్పంచ్ మూల సుమలత, ఇద్దరు ఉప సర్పంచ్ లను, ప్రస్తుత పంచాయతీ కార్యదర్శిని, బాధ్యులైన ఇతరులపై కూడా తక్షణమే చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు. గత నాలుగు సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై, అవినీతికి పాల్పడి దుర్వినియోగాన్ని కప్పి పుచ్చే ప్రయత్నాలు చేసిన అధికారులపై, దొంగ రికార్డులు సృష్టించిన వారిపై, ఇందుకు సహక రించిన పాలక వర్గం పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దుర్వినియోగం అయిన మొత్తం సొమ్ము రికవరీ చేయాలని ఆయన జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో గ్రామ అభివృద్ది కమిటి ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి పెద్దనవెని రాజేందర్, కోర్ కమిటి వైస్ చైర్మన్ పెడ్డనవెని రాగన్న, విడిసి ప్రతినిధులు కళ్లెం నగేష్, అహ్మద్, కోడిమ్యాల రాజన్న, మాజీ ఎంపిటిసి నగునూరి చిన్న రామాగౌడ్, కళ్లెం హన్మంతు, భారతపు గంగాధర్, చుక్క విశాల్, చుక్క రాజన్న, మామిడి హన్మండ్లు, లక్ష్మి కాంతం, గొడిశెల శంకర్, రాగిల్ల లచ్చన్న , గంగన్న , రంగన్న, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.