జగిత్యాల: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ , కాంగ్రెసు సీనియర్ నాయకులు తాటిపర్తి జీవన్ రెడ్డికి తెలంగాణలో ఏర్పడబోయే నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి రావాలని అన్ని మతాల వారు , కాంగ్రెస్ నాయకులు పూజలు చేశారు.
బుధవారం జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల లోని భీమేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఎలాగైనా జీవన్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకునేలా చేయాలని వేడుకున్నారు.
జగిత్యాల నుండి ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం పొందినప్పటికి ఎమ్మెల్సీ పదవీకాలం మరో ఏడాదిన్నర కాలం ఉండడాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
తెలంగాణా శాసన మండలిలో 40 మంది ఎమ్మెల్సీలకు గాను 28 మంది బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన వారున్నారని, కాంగ్రెస్ నుండి కేవలం జీవన్ రెడ్డి ఒక్కరే ఉన్నారని, ఆయన ఎమ్మెల్సీగా 40 వేల మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించి రికార్డు సృష్టించారని ,కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకున్న నేతకు తగు ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు అధిష్టానాన్ని కోరుతున్నారు.
40 ఏళ్ల
రాజకీయ అనుభవంతో పాటు రెండు సార్లు మంత్రిగా, ఆరు సార్లు ఎమ్మెల్యే గా, ప్రస్తుతం ఎమ్మెల్సీ గా కొనసాగుతున్న జీవన్ రెడ్డి ఎన్నికల్లో ఓడినా, గెలిచినా నిత్యం ప్రజాసేవలోనే గడుపుతున్నారని, ఆయన అనుభవాన్ని కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ, రాహూల్ ,ప్రియాంకలు గుర్తించాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు.