న్యూఢిల్లీ, నవంబర్ 3, (వాయిస్ టుడే): లోక్‌సభలో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న వివాదంలో ఎథిక్స్ కమిటీ విచారణ నుంచి తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా వాకౌట్ చేశారు. రోతపుట్టించే ప్రశ్నలు అడిగారంటూ ఆమె నిప్పులు చెరిగారు. ఆమెతోపాటు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డానిష్ అలీ వంటి విపక్ష ఎంపీలంతా ఈ విచారణను బహిష్కరించారు. ఒక మహిళా ఎంపీని పట్టుకుని వ్యక్తిగత విషయాలను కమిటీ చైర్మన్ అడుగుతున్నారంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రతి రోజు రాత్రి మీరు ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నారు ? మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో ప్రయాణం చేస్తున్నారు, ఏ హోటల్‌లో ఉంటున్నారంటూ అసంబద్ధ ప్రశ్నలు అడుగుతున్నారని వీరిద్దరూ మండిపడ్డారు.నైతిక విలువల కమిటీ చైర్మన్ అనైతికంగా ప్రవర్తిస్తున్నారని ఉత్తమ్ విరుచుకుపడ్డారు. ఇతరుల ప్రోద్బలంతో ఎథిక్స్ కమిటీ పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని విపక్ష ఎంపీలు విమర్శించారు. కమిటీ తీరుకు నిరసనగా సమావేశం నుంచి విపక్ష ఎంపీలు కూడా వాకౌట్ చేశారు.మహువా మొయిత్రా తమ కమిటీకి, దర్యాప్తునకు సహకరించలేదని ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోన్‌కర్ విమర్శించారు. విపక్ష సభ్యులు కూడా ఆగ్రహంతో ఆరోపణలు చేశారనీ, ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అకస్మాత్తుగా వాకౌట్ చేశారని తప్పుబట్టారాయన. తనతోపాటు, ఎథిక్స్ కమిటీపై అభ్యంతరకరంగా మాట్లాడి, తమ విధులకు ఆటంకం కలిగించారని వినోద్ సోన్‌కర్ మండిపడ్డారు.న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్.. గతంలో మహువాకు సన్నిహితుడు. కొన్నాళ్లు వారిద్దరు సహజీవనం చేశారు. వారు విడిపోయిన తర్వాత పెంపుడు కుక్క, మరికొన్ని వస్తువుల విషయంలో వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. తన మీద కక్షతో దేహద్రాయ్ ఇదంతా చేస్తున్నాడని మొయిత్రా అంటున్నారు. మరోపక్క అదానీని లక్ష్యంగా చేసుకోవడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువాకు సొమ్ము అందినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ప్రశ్నలు అడగడానికి డబ్బు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను మహువా తీవ్రంగా ఖండించారు. అయితే పార్లమెంట్ లాగిన్ ఐడీని వ్యాపారవేత్త హీరానందానికి ఇచ్చినట్లు మాత్రం అంగీకరించారు.



