మార్చిలోనే మండుతున్న ఎండలు
విజయవాడ, మార్చి 3, (వాయిస్ టుడే)
The scorching sun in March itself
మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మామూలుగానే ఉంటాయి. అటు చలికాలానికి, ఇటు ఎండాకాలానికి మధ్యలో ఉండే నెల కావడంతో పెద్దగా ఉష్ణోగ్రతల నమోదు ఉండదు. కానీ ఈసారి ఫిబ్రవరి నెలలోనే సూర్యుడు సుర్రుమనిపించాడు. ఇప్పుడు మార్చి నెల ప్రారంభమైంది. రోజులు గడిచేకొద్దీ ఉష్ణోగ్రతల పెరుగుదల రికార్డు స్థాయిలో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం కీలక విషయాలు వెల్లడించింది. మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏప్రిల్, మే నెలల్లో మరింత ప్రభావం ఉంటుందని, తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని చావు కబురు హాట్‌గా చెప్పింది.ఈ ఏడాది ఫిబ్రవరి నెల మొదటి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం పూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భానుడు ప్రతాపం చూపించాడు. దీంతో గత రికార్డులన్నీ చెరిగిపోయాయి. 124 ఏళ్లలోనే అత్యధిక వేడి నెలగా ఫిబ్రవరి నిలిచింది. గత నెలలో సగటున 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే తొలిసారి.ఫిబ్రవరిలోనే అల్లాడిపోయిన జనానికి ఈ మార్చి నెల మొదటి నుంచే మరింత చెమట పట్టనుంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా సుర్రుమనిపించేందుకు సూర్యుడు ప్రిపేర్ అయ్యాడు. ఇకపై 36 నుంచి 38 డిగ్రీల మధ్యే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది. రాత్రి పూట కూడా క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.రాయలసీమ ప్రాంతంలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. దక్షిణ కోస్తాలోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఉత్తర కోస్తాలోనూ ఇదే తీరు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు గోవా, కొంకణ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరగనుంది. వేడి గాలులు కూడా వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు చేసింది. ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50 శాతం తగ్గింది. దీంతో భూమిలో, గాలిలో తేమ శాతం తగ్గింది. వేడి పెరగడానికి ఇదో కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలు తలచుకుని జనం భయపడిపోతున్నారు. వారి భయానికి తగ్గట్టే అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. గొడుగు వాడితే మంచిది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు అధికంగా తీసుకోవడం మొదలు పెట్టాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. మసాలా ఫుడ్‌కు దూరంగా ఉండాలి. తరచూ నీళ్లు తాగడం వంటివి చేస్తుండాలి అని నిపుణులు సూచిస్తున్నారు.