42 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
*కాంగ్రెస్ చేతగానితనాన్ని కేంద్రంపై రుద్ది తప్పించుకోవాలనుకుంటున్నారు
*42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలే లబ్ది పొందుతారు
*బీసీలుసహా తెలంగాణ సమాజమంతా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం ఖాయం
*కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్ ఏప్రిల్ 2
The state government is responsible for implementing 42 percent reservations: Bandi Sanjay Kumar
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా డెడికేషన్ కమిషన్ వేసుకుని చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లను అమలు చేసుకునే అధికారం ఉంది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఆనాడు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే అమలు చేస్తామని చెప్పలేదు కదా? ఆ హామీ ఇచ్చేటప్పుడు మోదీ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు కదా? మరి ఇప్పుడెందుకు మోదీ ప్రభుత్వంపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని షో చేయడం కాదు… ఆ రాజ్యాంగంలో ఏముందో అర్థం చేసుకొని అమలు చేయాలనే ఇంగిత జ్ఞానం కాంగ్రెస్ నేతలకు లేదు.నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది. బీఆర్ఎస్ సపోర్ట్ కూడా ఉంది. అట్లాంటప్పుడు రాష్ట్రంలో అమలు చేసుకునే అధికారం ఉంది కదా? బీజేపీపై నెపం ఎందుకు నెడుతున్నారు? ఇది ముమ్మాటికీ పలాయనవాదమేనాన్నారు.మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ముమ్మాటికీ వ్యతిరేకం. తెలంగాణలో 56 శాతానికిపైగా ఉన్న బీసీ జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 46 శాతానికి తగ్గించింది. దీంతోపాటు 80 శాతానికిపైగా ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి బీసీల పొట్ట కొడుతున్నారు. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ రూపొందించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లులో 10 శాతం మంది ముస్లింలే ఉన్నారు. అంటే ఈ బిల్లువల్ల ముస్లింలు అదనంగా 10 శాతం రిజర్వేషన్ల లబ్ది పొందితే, బీసీలకు అదనంగా దక్కేది 5 శాతం మాత్రమే. ఈ లెక్కన బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసినట్లా? అన్యాయం చేసినట్లా? మనీ ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరును చూస్తుంటే ముస్లింల కోసమే బీసీ రిజర్వేషన్లు తెచ్చినట్లు స్పష్టమవుతోంది. మరి బీసీలకు ఇంతటి ఘోరమైన అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? పైగా కాంగ్రెస్ ను సంకనేసుకుని ఢిల్లీకిపోయి ధర్నాల పేరుతో డ్రామాలాడటం ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్ తీరును, బీసీ సంఘాల తీరును బలహీనవర్గాల ప్రజలతోపాటు తెలంగాణ సమాజమంతా గమనిస్తోంది. సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకుని ఇకనైనా బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధితో క్రుషి చేయాలని కోరుతున్నానన్నారు.