ఘనంగా ప్రారంభమైన తాండూర్ ఉర్సు ఉత్సవాలు
ఈ ఉత్సవాలకు వంద ఏండ్ల చరిత్ర
వివిధ రాష్ట్రాల నుండి భక్తుల రాక
కట్టుదిట్టంగా పోలీస్ భద్రత ఏర్పాట్లు
తాండూర్
The Tandoor Ursu celebrations have begun
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే బెల్లంపల్లి నియోజకవర్గంలో గల తాండూర్ ఉరుసు ఉత్సవాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ మేరకు బుధవారం తాండూర్ గ్రామంలోని దర్గా వద్ద ఘనంగా ఉరుసు ఉత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ ఉరుసు ఉత్సవాలు గత 100 సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి. ఈ యొక్క ఉత్సవాల్లో కవాలి నృత్యాలు సైతం ఉండనున్నాయి. ఇందుకు గాను వివిధ రాష్ట్రాల నుండి కళాకారులను రప్పిస్తున్నారు. అవి అక్కడికి వచ్చిన భక్తులను ఎంతగానో అలరింపచేస్తూ, ఆకట్టుకుంటాయి. ముక్యంగా కవాలి నృత్యాలు తిలకించడానికి చిన్నా, పెద్దా తేడా లేకుండా హాజరవుతారు. రాత్రింబవళ్లు అక్కడ కాలక్షేపం చేయడం ప్రతీ ఏట కనబడుతుంది. ఎంతో ప్రాముఖ్యం గల ఈ ఉరుసు ఉత్సవాలను తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుండి సైతం భక్తి శ్రద్ధలతో భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. కుల, మత వర్గాలకు అతీతమైనది కావడంతో ఈ ఉత్సవంకు ఎంతో ప్రాధాన్యం, ప్రాముఖ్యం సంతరించుకుంది. దీంతో సబ్బండ వర్గాలు తరలి రావడం మనకు కనిపిస్తుంది. కొంత మంది ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ముందస్తుగానే తాండూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు. వారి వారి సమీప బంధువుల ఇళ్లళ్ళకు చేరుకున్నారు. ఈ వేడుకలకు దర్గా కమిటీ ముందస్తు ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు. ఈ మేరకు దర్గా చుట్టుప్రక్కల సమీప పరిసరాలను పరిశుభ్రం చేశారు. దర్గా నిర్మాణాలకు సైతం రంగులు అద్ది అలంకరింప చేశారు. ఈ ఉ త్సవాలకు రానున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా ఏర్పాట్లు చేసినట్లు దర్గా కమిటీ ఇదివరకే ప్రకటించింది. సందర్శకుల సౌకర్యార్థం చిరు వ్యాపార సముదాయాలు వెలిశాయి. ఈ సమదాయాల్లో తినుబండారాల నుండి మొదలుకొని పిల్లల ఆట వస్తువుల వరకు లభించును. ఈ రెండు రోజుల ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా దర్గా కమిటీకి పోలీసు వారు సైతం దిశా నిర్దేశం చేస్తున్నారు.