హైదరాబాద్, అక్టోబరు 28, (వాయిస్ టుడే): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ ఎత్తులకు కాంగ్రెస్ పైఎత్తులు వేస్తోంది. బీఆర్ఎస్ కీలక నేతలు పోటీ చేసే చోట.. కాంగ్రెస్ కీలక నేతలను బరిలో నిలపాలని భావిస్తోంది. ఇటు పలువురు కాంగ్రెస్ కీలక నేతలు రెండు స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. కేసీఆర్ పై పోటీ చేయాలని రేవంత్ ను కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న హరీశ్ రావు, కేటీఆర్ పై కూడా ప్రధాన నేతలను పోటీలో ఉంచాలని కాంగ్రెస్ భావిస్తోందట. హరీశ్ రావు, కేటీఆర్ పై పోటీ చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ తోపాటు సిరిసిల్లలో పోటీకి చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండతో పాటు సిద్దిపేటలో కూడా పోటీ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు తోపాటు అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్ లో బరిలోకి దిగుతానని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈటల రాజేందర్ గజ్వేల్ కేసీఆర్ పై పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కట్టడి చేసే ఆలోచనలో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం రెండుచోట్ల పోటీపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి బయటికే వెళ్లకుండా కట్టడికి స్కెచ్ వేసినట్లు సమాచారం. ఏఐసీసీ వార్ రూమ్ డైరెక్షన్ లోనే రెండు సీట్లలో పోటీ చేయాలన్న నిర్ణయానికొచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఫైనల్ అయ్యాకే సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితాపై కసరత్తు కొనసాగిస్తోంది. . అటు బీజేపీ కూడా రెండో జాబితా పై కసరత్తు చేస్తోంది.