సమాజ పురోగమనంలో శ్రమ విలువ వెలకట్టలేనిది
The value of labor in the progress of society is immeasurable
– ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ
ప్రపంచ చరిత్ర మొత్తం శ్రమతోనే నిండి ఉందని, మానవ వికాసం, సమాజ పురోగమనంలో శ్రమ విలువ వెలకట్టలేనిదని ప్రముఖ కవి, ఉత్తమ సినీ గేయ రచయిత జాతీయ అవార్డు గ్రహిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. హైదరాబాద్, కొండాపూర్, సీఆర్ ఫౌండేషన్ లో నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ సుద్దాల అశోక్ తేజ రాసిన 57వ ‘శ్రమకావ్య’ గానం కార్యక్రమం జరిగింది. ఎన్ఆర్ఆర్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ డా. టి. సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్యెల్యే పల్లా వెంకట్ రెడ్డి, ప్రో. జి.వి. రత్నాకర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ‘శ్రమకావ్యం’ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ నాలుగు వేదాలు పుట్టకన్నా ముందే శ్రమ సామవేదాన్ని నేను ప్రవచిస్తున్నాను అన్నాడు. ఆధునిక కథా వాజ్ఞయాని కన్నా ముందే తను, శ్రమ కవితా కథా కథనకావ్యానికి సిరా పుష్పాల నేరి అక్షర మాల కట్టనని అన్నాడు. ఇప్పుడు మనుషులను విడదీసే మతాలు పుట్టక ముందే తాను ఏకైక శ్రామిక మతాన్ని ప్రకటిస్తున్నానని అన్నాడు. క్రైస్తవం, ముస్లిం, హిందూ మతాల కంటే ముందే ఏర్పడిన ఏకైక మతం శ్రామిక మతమన్నారు. పౌరాణిక ప్రతీకలను వాడుకొని కావ్యాలను రాశానని చెప్పారు. శ్రమ ప్రయాణమే శ్రమాయణం అని, రాముడు ధనస్సు, కృష్ణుడు వేణువు వేసుకున్న ఆభరణాలు, విష్ణువు పెట్టుకున్న కిరీటం కూడా శ్రమ జీవులు తయారు చేసిందేనని, శ్రముడు, శ్రమి కలిసి సాగిన ప్రస్థానం ఈ శ్రమ కావ్యం’ అన్నారు. శారీరక శ్రమ నుండే పాట, నృత్యం,పుట్టాయన్నారు. సుద్దాల అశోక్ తేజ తనదైన బాణీ ‘శ్రమకావ్యం’ గానం వినిపించగా, అయన సాహిత్యంలోని గుబాళింపు పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శులు మాజీ ఎమ్యెల్సీ పి.జె. చంద్రశేఖర్ రావు, చెన్నమనేని వెంకటేశ్వర్ రావు, కోశాధికారి వి. చెన్నకేశవ రావు, ఎన్ఆర్ఆర్ పరిశోధన కేంద్రం సభ్యులు దేశిని లక్ష్మినారాయణ, జోష్యభట్ల కల్పన, కనపర్తి జ్యోష్నా, డి కృష్ణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.