చివరకు చిక్కిన ఐదో చిరుత
తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనుకు చిక్కింది.. వన్య మృగాల సంచారం నేపధ్యంలో ఆపరేషన్ చిరుతను అటవీ శాఖ అధికారులు కొనసాగిస్తున్నారు.. అలిపిరి కాలిబాట మార్గంలో ట్రాప్ కెమెరాల ద్వారా వన్యమృగాల కదలికలను గుర్తించిన టిటిడి అటవీశాఖ అధికారులు రెండు నెలల వ్యవధిలో ఐదు చిరుతలను బంధించారు.. రాత్రి 12 గంటల ప్రాంతంలో చిరుత బోనుకు చిక్కింది.. దీంతో టిటిడి అటవీ శాఖా అధికారులు సంఘటన స్ధలం వద్దకు చేరుకుని చిరుతను ఎస్వీ జూపార్క్ కు తరలించి శాంపుల్స్ సేకరిస్తున్నారు.. చిరుత బోనుకు చిక్కిందని విషయం తెలుసుకున్న టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంఘట స్ధలం వద్దకు చేరుకుని పరిశీలించారు..

అనంతరం టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అలిపిరి కాలిబాట మార్గంలోని ఏడవ మైలు వద్ద రాత్రి 12 గంటల ప్రాంతంలో మరో చిరుత బోనుకు చికిందని, రెండు నెలల వ్యవధిలో ఇప్పటి వరకు ఐదు చిరుతలను బంధించడం జరిగిందని తెలిపారు.. భక్తుల క్షేమం, భద్రత, సౌలభ్యం కల్పించడానికి టీటీడీ పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.. అటవీ శాఖ అధికారుల సహకారంతో అలుపెరుగని కృషి వల్ల ఐదు చిరుతలను బంధించామని, భక్తులకి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మా ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు.. గుంపులు గుంపులుగా ప్రయాణించమని భక్తులకి నిరంతరం విజ్ఞప్తి చేయడంతో పాటుగా వారి వెంట భద్రత సిబ్బందిని పంపుతున్నామని ఆయన చెప్పారు.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి చిన్న పిల్లలను, వారి తల్లిదండ్రులను నడక మార్గం గుండా అనుమతించడం లేదని, నిన్నటి నుంచి అలిపిరి నడక మార్గంలో ఊత కర్రలను ఇస్తున్నామని, కర్రలపై ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, కర్రలు ఇచ్చి మా పని అయిపోయిందని మేము ఎప్పుడు అనుకోవడం లేదన్నారు.. కేవలం భక్తులకు ఆత్మస్థైర్యం అందించేందుకే కర్రలు అందిస్తున్నామని, కర్రలు ఇస్తున్నామని చెప్పిన తర్వాత నాలుగు చిరుతలను బంధించామని, భక్తుల విషయంలో టిటిడి ఎంత బాధ్యతయుతంగా పని చేస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చైర్మన్ స్పష్టం చేశారు.. 200 మంది అటవీశాఖ సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తున్నారని, యాత్రికుల విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, విమర్శలకు, బూతులకు జడిసి భద్రతా కార్యక్రమాలను ఆపేది లేదంటూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు.. అనంతరం తిరుపతి వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బోన్లో ట్రాప్ అయిన చిరుతను క్వారంటైన్ కు తరలిస్తున్నామని, దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు శాంపుల్స్ ని పంపించడం జరిగిందని, నివేదిక వచ్చిన తర్వాత ఏ చిరుత దాడి చేసిందో నిర్ధారణకు వస్తుందని, నరకదారికి నలువైపులా వన్యమృగాల సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు.. రెండు నడకమార్గాల్లో నిరంతరాయంగా అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు..