నిండుసభలో మహిళల పట్ల వారి వ్యాఖ్యలు అత్యంత అవమానకరం…
Their comments towards women are extremely insulting…
హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ శాసనసభలో మహిళా నేతల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు గాను వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నిండు శాసనసభలో సీఎం, డిప్యూటీ సీఎంలు మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని… వారి ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. వెంటనే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి సీఎం, డిప్యూటీ సీఎంలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా అని చెప్పుకొచ్చారు. ఎంతో హుందాగా, ప్రజలకు సేవ చేసే గుణం వారిదన్నారు. అలాంటి మహిళ నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదు మొత్తం మహిళలపై వారికున్న చులకన భావాన్ని తెలియజేస్తోందన్నారు. కచ్చితంగా మహిళలంతా కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని గమనిస్తున్నారని.. వారికి సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మహిళ సభ్యులపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే..
నిన్న సభలో ఏం జరిగిందంటే…
Their comments towards women are extremely insulting…
కాగా.. నిన్న(బుధవారం) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో పెను దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం ద్రవ్యవినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చర్చను మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తుండగా.. మధ్యలో రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘‘ప్రతిపక్ష సభ్యులు కలిసివస్తారనుకున్నాం. కానీ, ప్రతిపక్ష నేత సభకు రారు. కేటీఆర్‌కు సూచన చేస్తున్నా. వెనుక ఉన్న అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు. వాళ్లను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండులో కూర్చోవాల్సిందే’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా గందరగోళానికి దారితీశాయి. తమను ఉద్దేశించే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కుర్చీల్లోంచి లేచి నిరసన తెలిపారు. వెల్‌లోకి దూసుకొచ్చి పోడియంను చుట్టుముట్టారు. ఒకానొక సందర్భంలో మాజీ మంత్రి సబిత కంటతడి పెట్టారు. తనను ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు. ‘‘ఓ అక్కగా కాంగ్రెస్‌లోకి రా తమ్ముడూ అని రేవంత్‌ను ఆహ్వానించానని, కాంగ్రెస్‌లో ఆశాకిరణం అవుతావని, సీఎం అవుతావని ఆశీర్వదించాను’’ అని సబిత తెలిపారు. దీంతో సీఎం రేవంత్ మళ్లీ కల్పించుకుంటూ.. తనను మోసం చేసిన సబితక్కతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా కేటీఆర్‌కు సూచన చేశానని అన్నారు. ‘‘ సబితక్క నన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన మాట వాస్తవం. 2019లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నన్ను కోరింది. అక్కడి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క నాకు మాట ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించగానే.. ఆమె బీఆర్ఎస్‌లోకి వెళ్లి మంత్రి పదవి పొందారు’’ రేవంత్ అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బీఆర్‌ఎస్‌పై ఎదురు దాడికి దిగారు. 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి అనేక పదవులు ఇచ్చింది. కానీ.. సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరి మోసం చేశారు. ఒక దశాబ్ద కాలం సబితకు మంత్రి పదవి ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే సబిత బీఆర్ఎస్‌లోకి వెళ్ళారు. కాంగ్రెస్ నన్ను సీఎల్పీ లీడర్ చేస్తే నా వెనక ఉండాల్సింది పోయి పదవి కోసం సబిత పార్టీ మారారు’’ అంటూ భట్టి విమర్శలు గుప్పించారు. సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే సభ్యుల ఆందోళనల మధ్యే ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది..