అక్కడ ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు

- Advertisement -

ఆసిఫాబాద్‌ : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 12 గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల్లో నిర్వహించే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లేస్తున్నారు. ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికి రెండేసి చొప్పున రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఓటరు ఐడీ కార్డులు ఉన్నాయి. గ్రామాల్లోనూ రెండు రాష్ట్రాలకు చెందిన విద్యుత్తు స్తంభాలు, రెండు పాఠశాలలు, రెండు అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు ఉండటం గమనార్హం. పౌరులు రెండేసి ఓటరు కార్డులతో రెండు రాష్ట్రాలు నిర్వహించే ఎన్నికల్లో ఓట్లేస్తుండటంతో వారికి ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు సీఎంలు, ఇద్దరేసి చొప్పున ఎంపీలు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ (ప్రస్తుత కుమురంభీం) జిల్లా కెరమెరి మండలంలోని పరందోళి, కోటా, శంకర్‌లొద్ది, లెండిజాల, ముకుదంగూడ, మహరాజ్‌గూడ, అంతపూర్‌, ఇంద్రానగర్‌, పద్మావతి, ఎస్సాపూర్‌, బోలాపటార్‌, గౌరి గ్రామాలు 1956లో రాష్ట్రాల పునర్విభజన సమయంలో ఆంధప్రదేశ్‌లోకి వచ్చాయి. ఈ గ్రామాల్లో 9,246 మంది జనాభా, 3,283 మంది ఓటర్లు ఉన్నారు. భౌగోళికంగా, సాంస్కృతికంగా మహారాష్ట్రకు దగ్గరగా ఉండటంతో 1987లో ఈ గ్రామాలను చంద్రపూర్‌ జిల్లా జివితి తాలుకాలో చేరుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఈ ప్రాంతంలోని అటవీభాగమంతా కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో వివాద పరిష్కారానికి ఇరురాష్ట్రాలు సంయుక్తంగా కేకే నాయుడు కమిషన్‌ను ఏర్పాటు చేశాయి. ఈ కమిటీతోపాటు హైకోర్టు సైతం ఈ ప్రాంతాలన్నీ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవిగా తేల్చిచెప్పాయి. దీన్ని సవాల్‌ చేస్తూ మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular