Sunday, December 22, 2024

నెల రోజులుగా ఇవే కష్టాలు..

- Advertisement -

నెల రోజులుగా ఇవే కష్టాలు..
బెంగళూరు, మార్చి 25
బెంగళూరులో నీటి కొరతని దృష్టిలో పెట్టుకుని అధికారులు కొన్ని కండీషన్స్ పెట్టారు. గార్డెనింగ్, కార్ వాషింగ్ అంటూ అనవసరంగా నీళ్లు వృథా చేయొద్దని తేల్చి చెప్పారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. అయినా కొంత మంది ఇవేమీ పట్టించుకోకుండా నీటిని ఇష్టారీతిన వాడేస్తున్నారు. ఇలాంటి వాళ్లపై నిఘా పెట్టిన అధికారులు 22 కుటుంబాలకు షాక్ ఇచ్చారు. తాగునీటిని వృథా చేసినందుకు రూ.5 వేల జరిమానా విధించారు. వాటర్ సప్లై బోర్డ్‌కి ఈ ఫైన్ కట్టాలని స్పష్టం చేశారు. అత్యవసరాలకు మాత్రమే నీళ్లు వినియోగించుకోవాలని చెప్పినా కొంత మంది పట్టించుకోవడం లేదని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్ వాషింగ్‌ కోసం వాడుతున్నారని మండి పడుతున్నారు. ఇప్పటి వరకూ బెంగళూరు వాటర్ బోర్డ్ 22 కుటుంబాల నుంచి రూ.1.1లక్షల జరిమానా వసూలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది ఈ నిబంధనను పాటించడం లేదని, అక్కడే ఎక్కువగా ఫైన్‌లు వసూలవుతున్నాయని అధికారులు తెలిపారు. పదేపదే ఇదే తప్పు చేస్తే అదనంగా మరో రూ.500 జరిమానా కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతే కాదు. హోళీ వేడుకల్లో ఎవరూ కావేరీ నీళ్లని వాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. బోరింగ్ వాటర్‌నీ వినియోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌ల పేరుతో నీళ్లు వృథా చేయొద్దని హెచ్చరించారు. నీళ్లు తక్కువగా వాడేలా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని హోటల్స్, అపార్ట్‌మెంట్‌లు, పరిశ్రమలకు సూచించారు. దాదాపు నెల రోజులుగా ఈ నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు బెంగళూరు వాసులు. నీళ్లు లేక రెండు రోజులకోసారి స్నానం చేస్తున్నారు. ఇంట్లో పాత్రలు వాడితే వాటిని కడిగేందుకు నీళ్లు కావాల్సి వస్తుందని…డిస్పోజబుల్‌ గ్లాస్‌లు, ప్లేట్‌లు వినియోగిస్తున్నారు. కొంతమందైతే షాపింగ్‌ మాల్స్‌లోని టాయిలెట్స్‌లో స్నానాలు కానిచ్చేస్తున్నారు. ఇక ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లిపోయి అక్కడి నుంచే పని చేసుకుంటామని చెబుతున్నారు. వర్షాకాలం వచ్చాక మళ్లీ ఆఫీస్‌లకు వస్తామని అంటున్నారు. సోషల్ మీడియాలో చాలా రోజులుగా ఈ చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటి వరకూ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బెంగళూరుకి రెండే రెండు మార్గాల్లో నీళ్లు సరఫరా అవుతున్నాయి. భూగర్భజలాలపైన ఆధారపడాలి..లేదా కావేరీ నదీ నీళ్లు వాడుకోవాలి. కానీ…ఈసారి వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కావేరీ నదీ జలాల విషయంలోనూ తమిళనాడు ప్రభుత్వంతో వివాదం కొనసాగుతోంది. ప్రస్తుత కొరత తీరాలంటే బెంగళూరుకి రోజుకి 2,600 – 2,800 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. బెంగళూరు శివారు ప్రాంతాల్లోనూ ఇదే కొరత కనిపిస్తోంది. దాదాపు 110 గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది. 2007 తరవాత ఈ స్థాయిలో నీటి కొరత ఎదురైంది మళ్లీ ఇప్పుడే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్