హైదరాబాద్, అక్టోబరు 26, (వాయిస్ టుడే): ఎన్నికల సమయంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. తన భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తనతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కు ప్రాణహాని ఉందంటూ సంచలన ప్రకటన చేశారు. చంపేస్తానంటూ కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ పేర్కొన్న రాజాసింగ్ బుధవారం తనకు మరో బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపారు. తనను, తన కుంటుంబాన్ని, ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోతో పాటు నగర పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు లేఖను రాజాసింగ్ విడుదల చేశారు. కాల్ చేసిన వ్యక్తి సుమారు 6 నిమిషాల పాటు మాట్లాడాడని.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ ఫిర్యాదులో తెలిపారు.సిటీ పోలీసులకు ఇచ్చిన వీడియో స్టేట్‌మెంట్‌లో.. బుధవారం మధ్యాహ్నం 1:59 గంటలకు తనకు కాల్ వచ్చిందని రాజాసింగ్ చెప్పారు. “ఎన్నికలు లేదా కౌంటింగ్ రోజు ముందు నన్ను, నా కుటుంబానికి హాని కలిగిస్తామని కాలర్ బెదిరించాడు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోష్‌మహల్‌లో ప్రచారం చేసేందుకు నగరానికి వచ్చినప్పుడు తమకు హాని తలపెడతామని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు.. ఆ నంబర్ కాలర్ ఐడీ విదేశాలకు చెందినది..’’ అంటూ రాజాసింగ్ తెలిపారు.“ఈ వ్యక్తికి నా ప్రతి కదలిక గురించి హైదరాబాద్‌లో నివసించే వ్యక్తి నిరంతరం వివరిస్తున్నాడు. నా కుటుంబ సభ్యుల గురించి.. నేను ప్రచారానికి వెళ్లినప్పుడు.. ఏ బుల్లెట్ నడుపుతానో, అలాగే పలు విషయాల గురించి అతనికి తెలుసు” అని రాజా సింగ్ వివరించారు. “నేను గతంలో బెదిరింపు కాల్‌లను ఎదుర్కొన్నప్పటికీ, పోలీసులు ఈ ప్రత్యేక ముప్పును పరిష్కరించడం అత్యవసరం, ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్న ప్రస్తావన కారణంగా.. చర్యలు తీసుకోండి” అంటూ డిజిపికి విజ్ఞప్తి చేశారు.కాగా.. వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం ఏడాది తర్వాత భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అంతేకాకుండా.. మళ్లీ బీజేపీ గోషామహాల్ టికెట్ ను కేటాయించింది. ఈ మేరకు ఫస్ట్ లిస్ట్‌లోనే బీజేపీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.