తూప్రాన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం తెల్లవారుజామున 5, ఉదయం ఒక ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన నాగరాజు, రాజు, అన్నీస్‌బేగం ఇళ్ల తాళాలు పగులగొట్టినా ఎలాంటి వస్తువులు పోలేవు. సమ్యా సుల్తానా ఇంట్లో 3 తులాల బంగారం, రూ.20 వేల నగదు, అహ్మద్ బీ ఇంట్లో రూ.50 వేల నగదు, అర తులం బంగారం అపహరించారు. ఐదో వార్డులో నివాసముంటున్న తిరుమల రాజు, ఉమారాణి దంపతులు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఉమారాణి ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లగా ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగుడు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న పది తులాల బంగారం చోరీ చేశారు. వెండి వస్తువులు తీసుకెళ్లలేదు. ఉమారాణి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ కృష్ణ, ఎస్సై శివానందం సంఘటనా స్థలాలకు చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఒకేరోజు ఆరు ఇళ్లలో దొంగలు చొరబడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు నెలల వ్యవధిలో సుమారు 15 ఇళ్లల్లో చోరీలు జరిగాయి.