ఇది ప్రజా విజయం:
మంత్రి పొన్నం ప్రభాకర్
This is a public victory: Minister Ponnam Prabhakar
హుస్నాబాద్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన ఆశీర్వాదం
అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకోవడం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం రాజకీయ పార్టీదే కాకుండా, ఇది ప్రజల విజయం, తెలంగాణ ప్రభుత్వ పథకాల విజయం అని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్న నమ్మకానికి ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రజా పాలనకు అఖండ మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీని ఆదరించారని మంత్రి అన్నారు. ముఖ్యంగా పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారదర్శక పాలన, అవినీతి రహిత వ్యవస్థ, ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన వంటి అంశాలు ఈ విజయానికి ప్రధాన కారణాలని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లందరికీ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేయాలని, ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రివర్గం సమిష్టి కృషి ఫలితమే ఈ ఘన విజయం సాధ్యమైందని అన్నారు.
పారదర్శక పాలన, వేగవంతమైన అభివృద్ధి, ప్రజలకు దగ్గరగా ఉన్న ప్రభుత్వం అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే ధోరణి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు వల్లే పట్టణ ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని అన్నారు.
పురప్రజలు అందించిన ఆశీర్వాదాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ, వచ్చే మూడు సంవత్సరాల్లో మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం అందించే దిశగా కట్టుబడి పనిచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని, ప్రతి పట్టణం అభివృద్ధి దిశగా దూసుకెళ్లేలా కృషి చేస్తామని తెలిపారు.



