ఆలోచనలే మన జీవితాలను మార్చివేస్తాయి: సిఎం రేవంత్ రెడ్డి
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 20
Thoughts change our lives: CM Revanth Reddy
: ఆలోచనలే మన జీవితాలను మార్చివేస్తాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు వచ్చాయని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు అని.. ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన ఎఐ ఫలితాలు మనం చూస్తున్నామని తెలియజేశారు. మనిషి కంటే ఎఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందని, ఎఐ శకం ఇప్పటికే మొదలైందని సిఎం పేర్కొన్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని, ఇప్పుడు సాప్ట్ వేర్ విప్లవం నడుస్తోందని కొనియాడారు. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడతారని, ఎఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలని ఆకాంక్షించారు. ఎఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఎఐ వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం ఉందని తెలియజేశారు. ఎఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఇండియా అందిపుచ్చుకోవాలని, ఎఐ స్టార్టప్స్ లను భారత్ ప్రోత్సహించాలని కోరారు. ప్రతి ఆరు నెలలకోసారి హైదరాబాద్ వంటి ప్రదేశంలో ఎఐ సదస్సులు జరగాలని, జిఎస్టి కౌన్సిల్ తరహాలో ఎఐ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నానని, ఎఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ వచ్చి ఎఐ రంగంలో పెట్టుబడి పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలను కోరుతున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.



