విజయవాడ, ఆగస్టు 17: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణలోని గుంటూరు-బీబీనగర్, మహబూబ్‌నగర్-డోన్ మధ్య డబ్లింగ్, అలాగే ఒడిశాలోని ఖుర్దారోడ్డు నుంచి విశాఖపట్నం వరకు మూడోమార్గం నిర్మాణాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌లో కేంద్ర మంత్రివర్గం రూ.1,18,016 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. వచ్చే పదేళ్లలో 10వేల విద్యుత్తు బస్సులు ప్రవేశపెట్టడానికి రూ.57,613 కోట్లు, విశ్వకర్మ పథకానికి రూ.13వేల కోట్లు, డిజిటల్ ఇండియా విస్తరణకు రూ.14,903 కోట్లు, 9 రాష్ట్రాల్లో 2,339 కిలోమీటర్ల రైల్వే లైన్ల విస్తరణకు రూ.32,500 కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా 7 రైలు మార్గాలను 2 నుంచి 4 వరుసల వరకు విస్తరించనున్నారు. గుంటూరు-బీబీనగర్ (239 కి.మీ), ముద్ఖేడ్-మేడ్చల్, మహబూబ్‌నగర్-డోన్ (488 కి.మీ) మార్గాలను డబ్లింగ్ చేయనున్నారు. ఒడిశాలోని ఖుర్దారోడ్డు నుంచి విశాఖపట్నం వరకు మూడో మార్గం లైన్ నిర్మిస్తారు. గుంటూరు-బీబీనగర్ సెక్షన్‌ను విస్తరించేందుకు రూ.3,238 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో చెన్నై-హైదరాబాద్ మధ్య 76 కిలోమీటర్లు, విజయవాడ – సికింద్రాబాద్ మధ్య 38 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. చెన్నై – విజయవాడ – హైదరాబాద్ మధ్య మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయి. జగ్గయ్యపేట, జన్‌పహాడ్‌లలో ఉన్న సిమెంట్ కర్మాగారాలకు, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ధాన్యం మిల్లులకు దీనివల్ల మేలు జరుగుతుంది. 239 కి.మీ. ప్రాజెక్టులో 100 కి.మీ. ఏపీ పరిధిలోకి, 139 కి.మీ. తెలంగాణ పరిధిలోకి వస్తుంది. కృష్ణానదిపై 458 మీటర్ల పొడవైన వంతెన నిర్మిస్తారుమహారాష్ట్రలోని ముద్ఖేడ్ నుంచి తెలంగాణలోని మేడ్చల్ వరకు, అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్- ఏపీలోని డోన్ మార్గాన్ని రూ.5,655 కోట్లతో డబ్లింగ్ పనులు చేపడతారు. మహారాష్ట్రలో 49 కి.మీటర్లు తెలంగాణలో 295 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 74 కిమీ డబ్లింగ్ చేయనున్నారు. ఈ పనులతో సికింద్రాబాద్-బెంగళూరు మధ్య 50 కిలోమీటర్లు తగ్గుతుంది. రోజూ కొత్తగా 50 రైళ్లు నడపడానికి వీలవుతుంది. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి దక్షిణాదికి రావడానికి 3-4 గంటల సమయం తగ్గనుంది.ఒడిశాలోని నేరుగుండి-బరాంగ్, ఆ రాష్ట్రంలోని ఖుర్దారోడ్డు నుంచి విశాఖపట్నం వరకు 385 కి.మీ. మేర రూ.5,618 కోట్లతో మూడోలైను నిర్మిస్తారు. ఇందులో ఒడిశా భూభాగంలో 184 కిలోమీటర్లు, ఏపీ భూభాగంలో 201 కిలోమీటర్లు శ్రీకాకుళం రోడ్, విజయనగరం మీదుగా విశాఖపట్నం వరకు మూడో లైన్ అభివృద్ధి చేయనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో విశాఖ రైల్వేజోన్ ప్రస్తుత పరిస్థితి ఏమిటని విలేకరులు అడగ్గా సమాధానం ఇవ్వడానికి అనురాగ్ ఠాకుర్ నిరాకరించారు. అడిగే ప్రశ్న తాజా కేబినెట్ సమావేశానికి సంబంధించినదై ఉండాలని చెప్పారు.