12.2 C
New York
Wednesday, April 24, 2024

ప్రజల గొంతుక మల్లు స్వరాజ్యం  వర్ధంతి నేడే

- Advertisement -

ప్రజల గొంతుక మల్లు స్వరాజ్యం  వర్ధంతి నేడే

మార్చి 19న ద్వితీయ వర్ధంతి
సేకరణ:( ఏనుగుల వీరాంజనేయులు సీనియర్ జర్నలిస్ట్)
తెలంగాణలోని హైద్రాబాద్ సంస్థానంలో ఫ్యూడల్ వ్యవస్థ మీద,జాగీర్దార్ మీద,రజాకార్ల రాక్షసత్వం మీద,ఆ తర్వాత భారత సైన్యం మీద, తెలంగాణలోని అసంఖ్యాకమైన స్త్రీలు – పురుషులు చేసిన తిరుగుబాటు చారిత్రాత్మకం. అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం,నిజాం సంస్థానంలో కనీస పౌర హక్కులు లేవు,విద్యా,వైద్య అవకాశాలు శూన్యం,ప్రజలకు ప్రాణ రక్షణ లేదు, రైతుల మీద మోయలేని పన్నుల భారం,సౌకర్యాలు శూన్యం,మధ్య యుగాలనాటి ఫ్యూడల్ అణిచివేత విధానం, లేవీ ధాన్యం వసూళ్ళు సాంఘిక,ఆర్థిక దోపిడి,ఈ ఫ్యూడల్ రాచరిక రాజ్యంలో నైజాం.నవాబు పరిపాలనలో ఎన్ని దురాఘతాలు ఎన్నోన్నో దుర్మార్గాలు స్వేచ్ఛా వాయువు లేని చీకటి రాజ్యం,కుల అణిచివేత,వెట్టిచాకిరీ,బానిస యుగాల నాటి దుర్మార్గమైనటు వంటి దోపిడీ పాలన కొనసాగు తున్నటువంటి రోజులవి.చిరుప్రాయంలో బంధూకు చేతబట్టి భూస్వాములను నైజాం రజాకార్లను తరిమికొట్టిన వీరవనిత విప్లవ ధృవతార కామ్రేడ్ మల్లు స్వరాజ్యం.ఆమె (ఉమ్మడి నల్లగొండ జిల్లా) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో
ఓ భూస్వామ్య కుటుంబంలో 1931లో భీంరెడ్డి రాంరెడ్డి చుక్కమ్మలకు జన్మించారు. “పువ్వు పుట్టగానే పరిమళించు” అన్నట్లు ఆమె చిన్ననాడే పోరాట పంథాను ఎంచుకున్నారు.11 సం॥రాల వయస్సులో ఆమె తండ్రి చనిపోయాడు.అక్క శశికళ కూడా పోరాటంలో 3 సం॥రాలు జైలు జీవితం గడిపారు.స్వరాజ్యం తల్లి చుక్కమ్మ గొప్ప సామ్యవాది.తన కుటుంబం అంతా నేటికి విప్లవ రాజకీయాలతో పెనవేసుకొని ఉన్నది.నాడు చెక్క పలకలపై ఇసుకలో ఓనమాలు దిద్దుకొని క్రమంగా 5వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. చిన్నతనంలో కమ్యూనిష్టు భావాలు అలవర్చుకొని దోపిడీకి వ్యతిరేకంగా,తన సొంత గ్రామంలో గ్రామ పటేళ్ళను,పెత్తందార్లను ఎదిరించి పాలేర్ల సంఘం పెట్టి కూలిరేట్ల ఉద్యమంతో ప్రారంభమైన ఆమె విప్లవ జీవితం 8 దశాబ్దాల పాటు ఏనాడు వెనుదిరగలేదు. విప్లవమే జీవితంగా భావించి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆమె పోరాటాలకు తట్టుకోలేక సొంత ఇంటిని ధ్వంసం చేసినా, స్వరాజ్యంను పట్టుకుంటే నాటి ప్రభుత్వం బహుమతులు కూడా ప్రకటించినా మొక్కవోని ధైర్యంతో తన అన్న భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి (బి.యన్.) అడుగు జాడల్లో పోరాటాల్లోకి వచ్చిన స్వరాజ్యం ఏనాడు మడమ తిప్పలేదు.పోరాటమే ఆయుధంగా గెరిల్లా దళాల్లో చేరి దొరల దుర్మార్గాలను ఎదుర్కొంటూ నైజాం రజాకార్ల పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన వీరవనిత మల్లు స్వరాజ్యం,విప్లవోద్యమంలో తనదైన ముద్ర వేసుకొని అలుపెరగని పోరాట యోధురాలుగా “ఆమె మాటే తుపాకి తూటాల” తనదైన పాత్ర పోషించిన ఆమె పోరాటం చిరస్మరణీయం.ఆ పోరాట ఘట్టాలు నాటికి,నేటికి ఎప్పటికి ప్రజల మదిలో స్ఫురిస్తూనే ఉంటాయి.

తెలంగాణలో భూమికోసం, భుక్తికోసం,వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె ముఖ్య భూమిక పోషించారు.తెలంగాణలో వెట్టిచాకిరి రద్దు చేయాలని,దున్నేవానికి భూమి కావాలని,నైజాం నవాబు గద్దె దిగాలనే నినాదాలతో సాగిన మహత్తర సాయుధ పోరాటం,ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగిన పోరాటం.ఆ సాయుధ పోరాట ఫలితంగా
తెలంగాణలో 3వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి.4 వేల మంది వీరమరణం పొందారు.10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేయబడింది.భూస్వాముల భూములు,గఢీలు ప్రజల స్వాధీనమైనవి.వెట్టిచాకిరీ రద్దయింది.వడ్డీ వ్యాపారం అక్రమ భేదాఖళ్ళు నిలిపి వేయబడ్డాయి.వ్యవసాయ కూలిరేట్లు పెంచ బడ్డాయి.గ్రామాలను గ్రామ రైతు కమిటీలు పరిపాలించారు.నైజాం రజాకార్ల బారి నుండి రైతాంగాన్ని రక్షించుకొనేందుకు 10 వేల మంది గ్రామరక్షక దళాలు 2 వేల మంది గెరిల్లా సాయుధ దళాలు నిర్మించారు. ఫలితంగా సాగిన పోరాటంలో మధ్యయుగాల నాటి నైజాం నవాబు పాలన అంతమొందింది.

కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన సాయుధ రైతాంగ పోరాటం అనేక విజయాలు సాధించింది.ఫలితంగా దేశవ్యాప్తంగా భూసంస్కరణ చట్టం వచ్చింది,కౌలుదారి చట్టం వచ్చింది,పౌర హక్కులు వచ్చాయి,ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వచ్చాయి.ఈ చారిత్రక పోరాటంలో స్వరాజ్యం పాత్ర అద్వీతీయం అజరామం.

ఎర్రజెండానే ఊపిరిగా, పోరాటమే ఆయుధంగా 1945, 1948 సంవత్సరాలలో సాగిన వీరోచిత రైతాంగ పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. నైజాం సర్కారును గడగడ లాడించిన ధీశాలి కా॥మల్లు స్వరాజ్యం .ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్,వరంగల్ జిల్లాల్లో దళ కమాండర్ గా పనిచేసారు.గోదావరి అడవుల్లో 3 సం॥రాల పాటు పనిచేసారు.ఆమె మొదట జోన్ కార్యకర్తగా ఆ తర్వాత ప్రాంతీయ కమిటీ సభ్యురాలుగా,గుండాల కేంద్రంలో కోయలను ఉత్తేజ పరిచి వారికి నాయకత్వం వహించి పోరాటాలలోకి దింపింది స్వరాజ్యం గారు. భూస్వామ్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ అణగారిన వర్గాల్లోకి,వ్యవసాయ కార్మికుల్లోకి చొచ్చుకొని పోయి వారిలో ఒకరిగా ప్రజలతో మమేకమయ్యే లక్షణం కలిగి ఉండేది.తదనంతరం మార్క్సిస్టు పార్టీ ఉద్యమంలో కీలకమైన బాధ్యత నిర్వహిస్తు తుంగతుర్తి శాసన
సభ్యురాలిగా,పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా,మహిళా సంఘం ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక పోరాటల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఆమె మాటే తుపాకీ తూటా

మల్లు స్వరాజ్యం వ్యక్తి కాదు ఆమె ఒక మహాశక్తి,ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్క్సిస్టు పార్టీ ఉద్యమానికి అండదండలు ఇచ్చి, కార్యకర్తలను అక్కున చేర్చుకొని కాపాడటంలో ఎనలేని కృషి చేసారు.

మార్క్సిస్టు పార్టీ ఉద్యమంపై, కార్యకర్తలపై నాడు పాలకపార్టీ గుండాలు హత్యల పరంపర కొనసాగుతున్న రోజుల్లో మండే కొలిమిలా మార్క్సిస్టు ఉద్యమంపై దాడులు జరుగుతున్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చిన ఘనత కా॥బి.యన్.,కా॥స్వరాజ్యం పాత్ర వెలకట్ట లేనిది.

మిర్యాలగూడెం ప్రాంతంలో రాగిరెడ్డి వీరారెడ్డి,గాదె శ్రీనివాసరెడ్డి,పొనుగోడులో అందె నర్సయ్య,సుందరి బసవయ్య,మల్లారెడ్డిగూడెం కందుల గుర్వారెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి,యాతవాకిళ్ళలో పున్నంరాజు,మునగాలలో ముదిరెడ్డి ఆదిరెడ్డి, సూర్యాపేటలో ధనియాకుల గుర్వయ్య హత్యలతో పాటు సూర్యాపేట,తుంగతుర్తి, పుట్టపాక లాంటి అనేక గ్రామాల్లో,ఉద్యమ కేంద్రాల పైన దాడులు జరిగినప్పుడు ఆ కేంద్రాలకు అండనిచ్చి వారి కుటుంబాలకు మనోధైర్యాలను నింపటంలో ఆమె నిర్వహించిన పాత్ర అద్వీతీయం.

పాలకపార్టీల అండతో పోలీసులు ఉద్యమ కేంద్రాలపై దాడులు చేసినప్పుడు,పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి,చిత్రహింసలకు గురిచేసినప్పుడల్లా ఆమె గళమెత్తితే పాలక వర్గాలకు, పోలీసులకు లాగు తడిచేది. స్వరాజ్యం ఏ సభలో పాల్గొన్నా,ఆమె ప్రసంగం కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూసేవారు,కేరింతలు కొట్టేవారు.

జిల్లా అభివృద్ధిలో స్వరాజ్యం పాత్ర కీలకం:

ఉమ్మడి నల్లగొండ జిల్లాను సమగ్రా అభివృద్ధి చేయాలని సాగు,త్రాగునీరు,ఫ్లోరైడ్ నివారణ కోసం నిరంతరం ఆమె గళాన్ని శాసనసభలో ప్రజాపోరాటాల్లో తన వాణిని వినిపించేది.1978లో, 1983లో రెండు పర్యాయాలు తుంగతుర్తి ఎం.ఎల్.ఏ.గా గెలిచి తుంగతుర్తితో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధికై పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆమెది.తుంగతుర్తి ప్రాంతానికి యస్.ఆర్.ఎస్.పి. సమరశీల పోరాటాల ద్వారా సాగు,త్రాగు నీటి కోసం నిరంతరం పోరాటం చేసి విజయం సాధించిన ఘనత కమ్యూనిస్టులదే.తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జూనియర్ కళాశాలతో పాటు,రోడ్లు,విద్య,వైద్యం సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి అభివృద్ధి ప్రధాతగా పేరు తెచ్చుకున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శ్రీశైల సొరంగ మార్గం నుండి ఏ.యం.ఆర్.పి.ప్రాజెక్టు ద్వారా హైద్రాబాద్ త్రాగునీరు, నల్లగొండ జిల్లాకు సాగు, త్రాగునీరు శాశ్వత పరిష్కారం సాధించిన ఘనత కమ్యూనిస్టులదే,జిల్లా అభివృద్ధిలోను,ప్రజా పోరాటాల్లోను మల్లు వెంకట నర్సింహ్మారెడ్డి, బి.యన్.,స్వరాజ్యం జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు.

ఆమె జీవితం అంతా పోరాటాల మయం,ఆమె త్యాగం వెలకట్ట లేనిది,ఆమె చరిత్ర విప్లవోద్యమాలకు పూలబాట,ఆమె పరిపూర్ణమైన విప్లవ జీవితం గడిపారు.
భూస్వామ్య వర్గంలో పుట్టినా పీడిత వర్గాలకోసం తుదిశ్వాస వరకు పనిచేసారు.ప్రతినిత్యం పీడితుల కోసం గలమెత్తి నినదించేవారు.ఆమె గొప్ప ఆదర్శ కమ్యూనిస్టు,ఆమె నిరాడంబరత నేటి తరానికి ఆదర్శం.ఎన్నో కుటుంబాలు ఆమె పేరును తమ పిల్లలకు నామకరణం చేసుకున్నారు.
ఆమె చరిత్ర పాఠ్యపుస్తకాల్లో లిఖించబడ్డది.తెలంగాణలో ప్రజారాజ్య స్థాపనే ఆమె లక్ష్యం,ప్రజా పోరాటాలను నిర్మిద్దాం – మల్లు స్వరాజ్యం ఆశయాలను సాధిద్దాం.
ఇదే ఆమెకు మనమిచ్చే ఘనమైన నివాళి.తేదీ 19, మార్చి 2024 న ప్రజాఉద్యమాల కేంద్రమైన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట పట్టణ పరిధిలోని మల్లు స్వరాజ్యం స్వగ్రామమైన రాయినిగూడెం గ్రామంలో ద్వితీయ వర్ధంతి సభ జరుగుతున్నది.ఈ సభకు అధిక సంఖ్యలో ప్రజలు. పాల్గొనాలని విజ్ఞప్తి… మత తత్వ రాజకీయాలు ఓడిద్దాం ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం స్వరాజ్యం ఆశయ సాధన కోసం మనందరం పునరంకిత మవుదాం, ఇవే స్వరాజ్యం కి విప్లవ జేజేలు. ఏనుగుల వీరాంజనేయులు తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!