
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో….
ఉస్మానియా యూనివర్సిటీ, వి హబ్ మధ్య కుదరనున్న ఒప్పందం..
ఓయూను సందర్శించిన వి హబ్ ప్రతినిధుల బృందం.
తార్నాక, ఓయూ క్యాంపస్: ఆగస్టు 3, ( వాయిస్ టుడే ప్రతినిధి ): మహిళలను పారిశ్రామిక వేత్తలు గా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో పనిచేస్తున్న వీ హబ్ తో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం యోచిస్తోంది. ఈ మేరకు వీ హబ్ ప్రతినిధులు ఓయూను సందర్శించి…ఉపకులతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఓయూలోని సీఎఫ్ఆర్డి లో వీహబ్ ఏర్పాటు చేయాలని ప్రాధమిక నిర్ణయానికి వచ్చారు. ఓయూలో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థిలను ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు వారికి ఆకర్షించాలన్నది వీహబ్ ప్రతిపాదన. ఇప్పటికే ఓయూలో టీ.బీ.ఐ. పనిచేస్తున్నప్పటికీ, వినూత్న ప్రతిపాదనలతో వచ్చిన వీహబ్ వల్ల ఓయూ విద్యార్థినులు లబ్ది పొందనున్నారు. వీహబ్ ఏర్పాటు వల్ల ఓయూ విద్యార్థులకు చేకూరే ప్రయోజనాలు, పరిశోధన, అంకురాల ఏర్పాటు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ప్రభుత్వ సహకారం ఇలా అన్ని అంశాలపై వీహబ్ సీఈఓ దీప్తి రావుల నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఓయూ అధికారులతో చర్చించింది. ఓయూకున్న ఖ్యాతి, విస్తృతి వీ హబ్ ద్వారా విద్యార్థినుల అభివృద్ధికి ఉపయోగపడుతుందని సీఈఓ దీప్తి రావు అన్నారు. ఈ సందర్భంగా ఓయూతో కలిసి తాము చేపట్టబోయే కార్యక్రమాలు వివరించారు. ఓయులో ఉన్న అత్యధిక శాతం విద్యార్థినులను సరికొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణల వైపు ఆకర్షించేందుకు వీహబ్ – ఓయూ కలిసి పనిచేయాలని ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ రవిందర్ యాదవ్ ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన అన్ని మౌళిక వసతులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఓయూలో ఏర్పాటు చేసే అంకుర కేంద్రం భవిష్యత్తు ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. పరిశోధనలు, నిధులు, ఇరుపక్షాలకు సంబంధించిన మేధోపరమైన వాటా తదితర అంశాలపై విధివిధానాలు రూపొందించి త్వరలోనే పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుంటామని వీహబ్, ఓయూ అధికారులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ బి. రెడ్యానాయక్, ప్రొఫెసర్ నవీన్ కుమార్, ప్రొఫెసర్ జీబీ రెడ్డి, ప్రొఫెసర్ విద్యాసాగర్, ప్రొఫెసర్ శ్రీనగేష్, ప్రొఫెసర్ సందీప్తా, ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ రాజేంద్రనాయక్, ప్రొఫెసర్ ప్యాట్రిక్ పాల్గొన్నారు. వీహబ్ నుంచి సీఈఓ దీప్తి రావుల, సృజన, తాజ్, జాహిద్ అక్తర్ షేక్ లు ప్రాతినిధ్యం వహించారు.


