వరంగల్, నవంబర్ 18, (వాయిస్ టుడే): తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని ఇప్పటికే అనేక ముందస్తు అంచనాలు వెలువడ్డాయి. ఓటరు నాడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పలుసంస్థలు ఈ దఫా విజయం హస్తానిదేనని తేల్చేయగా; మరికొన్ని సర్వేలు సంకీర్ణ ప్రభుత్వాన్ని అంచనా వేశాయి. మరోవైపు ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో ఈ ప్రభావం ఒకే రీతిలో ఉండబోదని; ఉత్తర ప్రాంతంలో కమలం ప్రాబల్యాన్ని అంత సులభంగా తీసిపారేయలేమని పరిశీలకులు భావిస్తున్నారు. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్నట్లు కనిపించినప్పటికీ మోదీ హైదరాబాద్ పర్యటన అనంతరం కాషాయ శిబిరమూ అప్రమత్తమై క్షేత్రస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టింది. వలసలు పోగా మిగిలిన పాతకాపులు, బలమైన నాయకత్వానికి క్షేత్రస్థాయి కార్యకర్తల సత్తువ తోడై ఆ పార్టీని ఇప్పటికీ నిర్ణాయక శక్తిగానే నిలిపి ఉంచిందని పలువురు విశ్లేషకుల అంచనా. సాధారణంగా ఎంఐఎంకు లాంఛనప్రాయమని భావించే ఆరు స్థానాలు పోనూ మిగతా 113 నియోజకవర్గాల్లో అధికారానికి అవసరమైన 60 స్థానాల్లో జెండా పాతితేనే ఏ పార్టీ అయినా గద్దెనెక్కేది. తెలంగాణలో అనేక స్థానాలు బీఆర్ఎస్‌కూ, కాంగ్రెస్‌కూ దుర్భేద్యమైనవిగా ఉన్నాయి. ఆ స్థానాలను మినహాయిస్తే ఇప్పుడు ముక్కోణపు పోరులో కమల దళం హోరాహోరీ తలపడుతుందని భావిస్తున్న ఆ 30 ఉత్తర తెలంగాణ నియోజకవర్గాలే కాంగ్రెస్ అయినా, బీఆర్‌ఎస్ అయినా అధికారాన్ని అందుకోవడానికి కీలకమవుతున్నాయి.ఓ దశలో ప్రధాన ప్రతిపక్షమన్న స్థాయిని చేరి; క్రమంగా దిగజారుతూ, ఓ వారం క్రితం వరకూ గణనీయమైన నిస్సత్తువ ఆవరించి ఉన్న బీజేపీలో ప్రధాని మోదీ వరుస పర్యటనలు ఊపును తెచ్చాయి. బీసీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతామని ప్రకటించి మెజార్టీ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ హామీ చాలా నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని పెంచే అవకాశముంది. ఇక పసుపు బోర్డు హామీతో ఉత్తర తెలంగాణలోని మూణ్నాలుగు నియోజకవర్గాల్లో ఆ పార్టీ బలం పెంచుకుంది.ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఏ వర్గాల ఓట్లను ఏ మేరకు తనవైపు మళ్లించుకోగలుగుతుందీ? ఏ పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేయబోతున్నదీ? అన్నవి ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయమమయ్యాయి.ఇదిలా ఉంటే సిర్పూరు, పఠాన్‌చెరు, సూర్యాపేట వంటి నియోజకవర్గాల్లో బీఎస్పీ కూడా హోరాహోరీ తలపడుతున్నది. పెద్దపల్లి వంటి నియోజకవర్గాల్లో యువ అభ్యర్థులు ఏనుగు గుర్తుతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.బీజేపీ నుంచి కరీంనగర్‌లో బండి సంజయ్, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, దుబ్బాకలో రఘునందనరావు, హుజూరాబాద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్, గోషామహల్‌లో రాజాసింగ్, ఉప్పల్‌లో ఎన్వీఎస్ఎస్ప్రభాకర్, సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరరావు, నిజామాబాద్అర్బన్లో ధనపాల్ సూర్యనారాయణ వంటి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే, వాళ్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం తమకే మేలు చేస్తుందని బీఆర్ఎస్భావిస్తున్నది. ఓ పది చోట్ల తప్ప బీజేపీకి సొంత ఓటు బ్యాంకు పెద్దగా లేదని, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు తమనే భావిస్తున్నారని కాంగ్రెస్చెప్తున్నది. బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటే మాత్రం సంకీర్ణం వచ్చే అవకాశంలేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక్కడ హోరాహోరీ…
- కరీంనగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ మధ్య ముక్కోణపు పోరు జరుగుతోంది. ఎంపీగా ఉన్న బండి సంజయ్గత శాసనసభ ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించగలిగారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ హవా కూడా ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తాను గెలుస్తానని గంగుల భావిస్తున్నారు.
- హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వొడితెల ప్రణవ్. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ.. ఈటలపై సానుభూతి తగ్గిందని, కాంగ్రెస్ బలం పెరగడం తనకు మేలు చేస్తుందని కౌశిక్‌రెడ్డి భావిస్తున్నారు.
- కోరుట్లలో బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి జువ్వాడి నర్సింగరావు, బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. పసుపు బోర్డు మంజూరు, షుగర్ ఫ్యాక్టరీ హామీలతో అర్వింద్ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ హవాతో పాటు గత ఓటమి సానుభూతిపై నర్సింగరావు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వీరిద్దరి మధ్యా చీలిపోతే తాను గట్టెక్కుతానని సంజయ్‌కుమార్ ఆశిస్తున్నారు.
- జగిత్యాలలో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సంజయ్, బీజేపీ నుంచి బోగ శ్రావణి బరిలో ఉన్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న శ్రావణి ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తుండడంతో అధికార పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని పరిశీలకులు చెప్తున్నారు.
- ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి జోగు రామన్న ఐదోసారి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున కంది శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి పాయల్ శంకర్ గట్టి పోటీనే ఇస్తున్నారు. మూడుసార్ల ఓటమి అనంతరం ఈ దఫా ఎలాగైనా గెలవాలని పాయల్శంకర్పట్టుదలతో ఉన్నారు.
- నిర్మల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇంద్రకరణ్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్‌కు ఉన్న కార్యకర్తల బలం కారణంగా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొన్నది.
- సిర్పూర్లో బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నుంచి పాల్వాయి హరీశ్ బాబు, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉందని భావించవచ్చు.
- పఠాన్ చెరులో బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది. బీఎస్పీ నుంచి పోటీకి దిగిన నీలం మధు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించారు.
- మంథనిలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు బీజేపీ అభ్యర్థి చందుపట్ల సునీల్‌రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి 2014లో టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
- వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి వికాస్‌రావు మధ్య గట్టి పోటీ ఉంది. నాలుగుసార్లు ఓడిపోయిన ఆది శ్రీనివాస్ సానుభూతి, ప్రజాదరణ తనను గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు; అయితే మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు కొడకు వికాస్‌రావు పోటీ చేస్తుండడంతో ప్రజల తీర్పుపై ఉత్కంఠ ఏర్పడింది.
- హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా వొడితెల సతీశ్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా శ్రీరాం చక్రవర్తి పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలంగా మారింది. శ్రీరాం పేరు ఆలస్యంగా ప్రకటించడంతో ప్రచారంలో వెనుకబడి ఉన్నారు. ఇది ఎవరికి లాభిస్తుందో వేచిచూడాల్సి ఉంది.
- వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేస్తున్నారు. అధికార పార్టీకి కొండా సురేఖ గట్టి పోటీ ఇస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా తనపని తాను చేసుకుపోతున్నారు.
- నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, బీఆర్ఎస్ నుంచి బిగాల గణేశ్‌గుప్త, బీజేపీ నుంచి ధనపాల్ సూర్యనారాయణ పోటీలో దిగారు. బీజేపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు, ధనపాల్‌కు గతంలో ఓటమి సానుభూతి కలిసిరావచ్చని భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓట్లను షబ్బీర్ అలీ నమ్ముకున్నారు.
- ఆర్మూరులో బీఆర్ఎస్ నుంచి జీవన్‌రెడ్డి, బీజేపీ నుంచి రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి వినయ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అధికార పక్షం ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత ఉందని పరిశీలకులు చెప్తున్నారు. ఓటుబ్యాంకును బీజేపీ, కాంగ్రెస్ హవాను వినయ్‌రెడ్డి నమ్ముకున్నారు.
- మహేశ్వరంలో బీఆర్ఎస్ నుంచి సబితారెడ్డి, కాంగ్రెస్ నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్ బరిలో ఉన్నారు. ఓటమి సానుభూతితో పాటు స్థానికుడు కావడం బీజేపీ అభ్యర్థికి కలిసొచ్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎటు పడ్తాయన్నదే గెలుపోటములను నిర్ణయించే అంశం