హైదరాబాద్, అక్టోబరు 25, (వాయిస్ టుడే): మరో నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పటికే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ మూడు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలను రంగంలోకి దింపి యాత్రలు, బహిరంగ సభలు పెడుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటు వరకు ప్రధాన పార్టీ అయిన టీడీపీకి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆదరణ తగ్గింది. టీడీపీ అగ్రనేతలు ఏపీకి షిఫ్టు కావడంతో… తెలంగాణలో టీడీపీని నడిపించే నేతలే కరువయ్యారు. టీడీపీలో ఉన్న నేతలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు జంప్ అవ్వడంతో…పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తెలంగాణలో టీడీపీకి మాత్రం కొంత క్యాడర్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో టీడీపీకి పట్టున్న స్థానాలు లేకపోలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో.. కీలక నిర్ణయాల్లో జాప్యం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ బరిలో టీడీపీ ఉంటుందా? తప్పుకుంటుందా? అనే చర్చ మొదలైంది.తెలంగాణలో ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుందని, ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా పోటీ చేయడం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారని ఓ వార్త హల్ చల్ చేస్తుంది. మంగళవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయింది. దీనిపై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సోషల్ మీడియాలో టీడీపీపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే కుట్ర పూరితంగా టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కాసాని ప్రకటించారు. ఇప్పటికే 75 మంది అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా అభ్యర్థుల ప్రకటనపై ఆలస్యం అవుతోందన్నారు. చంద్రబాబుతో మరోసారి కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ తర్వాత అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో ఉండడంతో… బీజేపీని కూడా కలుపుకుని ఈ మూడు పార్టీలు తెలంగాణ ఎన్నికల బరిలో నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నేతలు పవన్ పై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో జనసేన బరిలో నిలిచి అవకాశం ఉంది. అయితే పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు చంద్రబాబుతో ములాఖత్ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ భావిస్తున్నారు. పోటీలో ఉండాలని టీటీడీపీ నేతలు నిర్ణయించారు. చంద్రబాబు నిర్ణయం తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.