రెండు ఢిల్లీ పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి: ఎంపీ వద్దిరాజు
🟨 రాష్ట్రంలో కాంగ్రెస్ పాలననా? బీజేపీ పాలననా?
🟨 కరీంనగర్ ఘటనలపై పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు
Two Delhi-based parties are moving forward together: MP Vaddiraju.

హైదరాబాద్, ప్రతినిధి (వాయిస్ టుడే): రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పాలన నడుస్తుందా? లేక బీజేపీ పాలిస్తున్నదో అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కుమ్మకై ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు.
వారం పది రోజులుగా కరీంనగర్‌లో హైడ్రామా నడుస్తోందని, నగల దుకాణంలో జరిగిన దోపిడీ తర్వాత మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై దాడులు జరిగాయని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయని, కరీంనగర్ ఘటనలే దీనికి నిదర్శనమన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని ఉమ్మడి శత్రువుగా భావించి దాడి చేయడమే ఆ రెండు పార్టీల లక్ష్యమని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని “మాతో కలిసి నడవండి” అని బహిరంగంగా కోరిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ పార్లమెంటులో బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదైన ప్రతి సందర్భంలో సిట్ వేస్తారా? ఇది ఏదైనా కుంభకోణమా? అంటూ పోలీస్ అధికారులను ఎంపీ రవిచంద్ర ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బండి సంజయ్ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం తగదన్నారు. “ఎదుటివారికి కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని సూచించారు. సిట్ విచారణకు సహకరిస్తారా లేదా అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బాధితురాలు బీసీ వర్గానికి చెందిన అమ్మాయి అని, ఆమెకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ సహించదని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.




