శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా మందస మండలం గౌడగురంటి గ్రామ సమీపాన మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
ఈ దుర్ఘటనలో ఇద్దరు ఒడిశా వాసులు మృతి చెందగా మరో 27 మంది గాయాల పాలయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలో జరిగే బిజెపి సమావేశానికి పలువురు ఒడిశా వాసులు ట్రాక్టర్ పై వెళ్లే క్రమంలో మందస మండలం గౌడగురంటి గ్రామ సమీపాన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ సంఘటనలో ఒడిశా రాష్ట్ర పరిధిలోని బురతలో గ్రామపంచాయతీ గుడ్డిపద్ర గ్రామానికి చెందిన సవర.ఈశ్వర్ (55),కుసుమల గ్రామానికి చెందిన బుయ్య జగన్నాథ్ (52)లు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు.
సుమారు మరో 27 మంది గాయాల పాలయ్యారు. దీంతో రహదారి రక్తసిత్త మయింది. గ్రామంలో హాహాకారాలు నెలకొన్నాయి. సమీప గ్రామాల ప్రజలు,108 సిబ్బంది, పోలీసులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను108 లో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.