కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదోడి సొంతింటి కల,కలగానే మిగిలింది…!
Under the rule of the Congress government, own house dream remained just a dream.!
జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి..
జమ్మికుంట
ఈనెల 29,30 తేదీలలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుప తలపెట్టిన సిపిఎం పార్టీ జిల్లా 10వ మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి, పిలుపునిచ్చారు.
బుధవారం రోజున జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ
కష్టజీవుల పక్షాన నికరంగా నిలబడుతూ, జిల్లాలో ప్రజా సమస్యలపై ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ జిల్లా పదవ మాహసభలు జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ లో నిర్వహిస్తున్నామని, ఈ మహాసభల్లో మూడు సంవత్సరాల ఉద్యమాలను సమీక్షించుకొని, భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకుంటామన్నారు. మహాసభలో ప్రజా సమస్యలపై తీర్మానాలు చేస్తామన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్మరిస్తూ కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నారు.నాటి నుండి నేటి వరకు పేద ప్రజల పక్షాన కష్టజీవుల పక్షాన దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది ఎర్రజెండానే అన్నారు. భారత జాతీయ ఉద్యమంలో, క్రియాశీలకంగా పాల్గొన్నది ఎర్రజెండా పార్టీ అని అన్నారు, భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించింది కమ్యూనిస్టు లేనన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశభక్తి పేరుతో దేశసంపదను కార్పొరేట్లకు పప్పు బెల్లాళ్ల అమ్ముతూ ఆర్థిక అసమానతలను పెంచి పోషిస్తున్నారన్నారు. స్విస్ బ్యాంకు లో ఉన్న నల్లధనాన్ని బయటకి తెచ్చి జనధన్ ఖాతాలలో 15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నల్లధనం రాకపోగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి దేశం నుండి అనేకమంది కార్పొరేట్ పారిపోయారని అన్నారు.
ధరలు విపరీతంగా పెరుగుతున్న, అరికట్టడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు రాకపోగా పది సంవత్సరాల కాలంలో సుమారు 18 లక్షల ఉద్యోగాలను తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యం చేయాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏండ్లు అవుతున్న పేదవాడికి సొంత ఇల్లు లేకపోవడం పేద ప్రజల పట్ల పాలకుల చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమవుతుందని అన్నారు. ఉండడానికి ఇల్లు లేక, చేసుకోవడానికి చేతినిండా పనులు దొరక్క అద్దె ఇళ్ళలో ఉంటూ అనేక అవమానాలు భరిస్తున్నారని అన్నారు. ప్రతి పౌరుడికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు కల్పించాలనే భారత రాజ్యాంగ స్ఫూర్తిని పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న పేదోడు సొంతింటి కల కలగానే మిగిలిపోయింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అతి ముఖ్యమైన గ్యారంటీ సొంత ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న హామీ నేటికీ అమలు కావడం లేదన్నారు. రేషన్ కార్డు లేక అనేక మంది కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయడానికి మార్గదర్శకాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి శీలం అశోక్, కమిటీ సభ్యులు జక్కుల రమేష్, తదితరులు పాల్గొన్నారు..