కేంద్ర మంత్రి సీఆర్ పాటిలో సీఎం చంద్రబాబు భేటి
వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి
న్యూఢిల్లీ
Union Minister CR Patil meets CM Chandrababu Naidu
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని వివరించారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలి. ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయి. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేయాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకి ఆర్థిక సహాయం అందించాలి… ఫేజ్–IIలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. వీటికి అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరం . గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు… తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక–ఆర్థిక సాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.
ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలి. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదిక గెజెట్లో ప్రచురించాలి. ట్రిబ్యునల్ నివేదికను వెంటనే గెజెట్లో ప్రచురించి, వంశధారపై నిర్మించ తలపెట్టిన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలి. గోదావరి జలాల పంపకంపై ఏపీ-తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోంది. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అన్నారు.


