డిసెంబర్ 10లోగా యూనిట్లు అందజేయాలి
Units should be delivered by December 10
జయశంకర్ భూపాలపల్లి,
పాడిగేదెలు యూనిట్లు వచ్చే నెల 10వ తేదీ వరకు గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ డిఆర్డీఏ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో నూతన స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు, మహిళలను స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా నమోదు చేయడం, పాడి గేదెలు యూనిట్లు గ్రౌండింగ్, ఇందిరా మహిళా శక్తి కాంటీన్లు నిర్వహణ, స్వయం సహాయక సంఘాలు ద్వారా ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై గ్రామీణాభివృద్ధి శాఖ డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 80 వేలకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఇంకనూ ఎవరైనా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు గా నమోదు కాకపోతే అలాంటి వారిని గుర్తించి సభ్యులుగా చేయాలని, 10 మంది ఉంటే నూతన సంఘం ఏర్పాటు చేయాలని సూచించారు. నూటికి నూరు శాతం ప్రతి మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు కావాలని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో 15 అంశాలలో వ్యాపారులు నిర్వహణకు అవకాశం ఉందని అన్నారు. వచ్చే నెల 5వ తేదీన శిల్పారామంలో జరుగనున్న ఎగ్జిబిషన్ లో మన జిల్లాకు 2 స్టాళ్లు కేటాయించారని స్టాళ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదేని ప్రమాదం వాటిల్లితే కుటుంబానికి ఆర్ధిక ప్రయోజనం చేకూరేందుకు వీలుగా ప్రతి ఒక్కరినీ ఇన్సూరెన్సులో నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 27 వేల మందిని మాత్రమే నమోదు చేశారని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వచ్చే నెల 15వ తేదీ వరకు ప్రతి మహిళను నమోదు చేయాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండాలని సూచించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నయా చేతన 3.2 లో చిన్నారి నుండి వయోవృద్దు ల వరకు వివక్షత లేకుండా చూడాలన్నారు. ఏపీఎం ల విధులు చాలా కీలకమని గ్రామ స్థాయిలో కార్యదర్శి, విఓ, ఆశా విస్తృతంగా ఈ పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 4 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశామని మరికొన్ని ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని
పేర్కొన్నారు. డిఆర్డీఏ ద్వారా 30 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండాకొనుగోలు చేయాలని తెలిపారు. 17 శాతం మాయిచ్చర్ ఉంటే జాప్యం. లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో జరిగిన పనులకు సంబంధించిన దృవీకరణ లు పంపాలని, ఆలస్యం కావడం వల్ల నిధులు చెల్లింపుకు జాప్యం జరుగుతున్నదని తెలిపారు. అనంతరం మొరంచపల్లిలో మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహిస్తున్న మోకిడి రమ, దయ్యాల పద్మలతో కలెక్టర్ ముఖాముఖి అయ్యారు. క్యాంటీన్ నిర్వహణ వల్ల ఖర్చులు పోను ఎంత లాభం వస్తుందని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు కావలసినటువంటి సౌకర్యాలను తెలియజేయాలని తెలుపుగా నిర్వాహకులు క్యాంటీన్ మంచిగా నడుస్తుందని ఖర్చులు పోను రోజుకు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు మిగులుతున్నాయని తెలిపారు. తాము రెండు నెలల క్రితం క్యాంటీన్ ఏర్పాటు చేశామని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా క్యాంటీన్ నిర్వహకులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థలు
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,
డిఆర్డిఓ నరేష్, ఎల్డిఎం తిరుపతి, డిపిఎంలు, ఏపీఎంలు సీసీలు తదితరులు పాల్గొన్నారు