ఎల్ అండ్ టీ పై ఉత్తమ్ ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 18
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాలనలో వేగం పెంచింది. తనదైన దూకుడు ప్రదర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. మన్నటి వరకూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ జరిపిన రేవంత్ ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక రేవంత్ అండ్ టీం కూడా ఇదే జోష్లో తమ పరిపాలనా దక్షతకు పదును పెడుతున్నారు.మొన్నటి వరకు పౌర సరఫరాశాఖ అధికారులతో సమీక్షలు జరిపిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం నీటి ప్రాజెక్టులు నిర్మించిన ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేపట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ బృందంతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్లో ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్. వి దేశాయ్తోపాటు పలువురు సంస్థకు చెందిన ప్రతినిధులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఎల్ అండ్ టీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. రాష్ట్రానికి సంబంధించిన అతి పెద్ద నీటి ప్రాజెక్టులో నాసి రకం పనులు ఎలా చేస్తారని, నాణ్యత లేకుండా ఎలా నిర్మిస్తారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారులకు ఇచ్చి తమ ప్రమేయం ఏమీ లేదని తప్పించుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టమన్నారు.