- Advertisement -
వేమిరెడ్డి రూట్ మారుతోందా…
Vemireddy route is changing...
నెల్లూరు, జనవరి 20, (వాయిస్ టుడే)
నెల్లూరు జిల్లాలో బలమైన నేతగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిర్భవించారు. 2019 ఎన్నికలకు ముందే జగన్ పార్టీలో ఆయన చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత 2019 నుంచి 2024 వరకూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో కీలకంగానే వ్యవహరించారు. రాయలసీమలోని కొన్ని జిల్లాలకు జగన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సమన్వయ కర్తగా కూడా నియమించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు జిల్లాలో మంచి పేరుంది. ఆయన తన సేవా కార్యక్రమాలతో జనంలో పాపులర్ అయ్యారు. దీనికి తోడు ఆర్థికంగా బలమైన కుటుంబం కావడం కూడా జగన్ పార్టీ చేరదీసిందనే చెప్పాలి. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందు వరకూ వైసీపీలో ఉన్నా తర్వాత ఆయన అందులో కంఫర్ట్ గా లేరు.తాను చెప్పిన వారికే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో శాసనసభ సీట్లు ఇవ్వాలని జగన్ వద్ద షరతు పెట్టారు. అయితే అందుకు జగన్ అంగీకరించలేదు. దీంతో వెంటనే వేమిరెడ్డి జగన్ ను వదలి జెండా మార్చారు. నెల్లూరులో అప్పటికే బలహీనంగా ఉన్న టీడీపీ వేమిరెడ్డిని సాదరంగా ఆహ్వానించింది. ఆయనకు నెల్లూరు పార్లమెంటు సీటు, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. ఇద్దరూ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి టీటీడీ పాలకమండలిలో సభ్యురాలిగా కూడా నియమించారు. అయినా వేమిరెడ్డిలో ఎక్కడో ఏదో తేడా కొట్టినట్లు కనిపిస్తుంది. నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ విషయం స్పష్టమయింది. టీడీపీ స్థానిక నేతలకు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మధ్య సఖ్యత లేదని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అనేక విషయాల్లో అభిప్రాయ బేధాలు నేతలతో ఆయనకు ఉన్నట్లు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. కానీ ఇద్దరూ వైసీపీ నుంచి వచ్చారు కనుక టీడీపీలో తమకు ప్రాధాన్యత దక్కుతుందని భావించారేమో. కానీ వారు ఆశించనంత ప్రయారిటీ లభించకపోవడం, లోకల్ టీడీపీ లీడర్లు పెత్తనం చేస్తుండటం వేమిరెడ్డి వర్గాన్ని కొంత ఇరుకున పెట్టిందంటున్నారు. అందుకే వేమిరెడ్డి గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారని టీడీపీ అనుకూల మీడియాలోనే వార్తలు వచ్చాయి. అయితే పార్టీ నుంచి వెళ్లి పోయే పరిస్థితుల్లో లేవని అందరూ సరిపెట్టుకున్నారు. అధినాయకత్వం కూడా దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఈ విషయం మరోసారి స్పష్టమయింది. ఆంద్రప్రదేశ్ లో మీడియా రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి అందిరికీ తెలిసిందే. ప్రముఖ పత్రికలు చంద్రబాబుకు మద్దతు పలుకుతుండగా, సాక్షి సొంత పత్రిక కావడంతో సహజంగా జగన్ వైపే ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే ఈ పత్రికల్లో చూస్తుంటాం. అంతేకాదు.. ఒకరికి సంబంధించిన ప్రకటనలు మరొకరికి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సాక్షికి ఫుల్ పేజీ యాడ్ ఇవ్వడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. చర్చ మాత్రమే కాదు దుమారమే రేపాయి. సాక్షిలో కూడా ఈ ప్రకటన ప్రధానంగా ప్రచురితం కావడంతో అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ప్రకటనలో లోకేష్, చంద్రబాబును పొగుడుతూ ఉన్న ప్రకటన చేసినప్పటికీ అది సాక్షిలో రావడమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. వేమిరెడ్డిపై పార్టీ నేతల్లో మరింత అనుమానాలు పెరగడానికి కారణమయ్యాయని పార్టీ వర్గాలనుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
- Advertisement -