Saturday, September 14, 2024

సంజయ్ కు జయజయము..?

- Advertisement -

సంజయ్ కు జయజయము..?
కరీంనగర్ బరిలో బండి మహా దూకుడు
ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ బలహీనం
వినోద్ కుమార్ ను ప్రకటించినా ప్రతికూతలు
అభ్యర్థిని తేల్చుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్
వెల్చాల రాజేందర్ రావుకు ఇవ్వాలా వద్దా?
ఈయనకు బదులు మాజీ మంత్రి వైపు చూపు
ఆయనను ఇప్పటికే సంప్రదించినట్లు కథనం
స్థానికేతరుడైనా తీన్మార్ మల్లన్న పేరు పరిశీలన
ఈయనకు కేటాయిస్తే శ్రేణుల్లోనే వ్యతిరేకత
మల్లన్నను సమర్థించని సొంత సామాజిక వర్గం?
అందరికంటే సేఫ్ జోన్ లో బండి సంజయ్
మోదీ హవాకు సొంత కరిష్మాతో ముందడుగు
సంజయ్ కు ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకే

(వాయిస్ టుడే ప్రతినిధి, హైదరాబాద్)
తెలంగాణలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్ఠాత్మక ఎన్నికలు జరిగే నియోజకవర్గం ఏదంటే కరీంనగర్ అని చెప్పొచ్చు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టయిన కరినగరి.. ప్రతి ఎన్నికలోనూ తన ప్రత్యేకత చాటుతుంది. 2004లో అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను గెలిపించడం దగ్గర్నుంచి.. 2006లో సవాల్ గా మారిన ఉప ఎన్నికలో ఆయనను మళ్లీ నిలబెట్టడం, 2009లో కాంగ్రెస్ కు పట్టం కట్టడం.. 2014లో మళ్లీ బీఆర్ఎస్ కు గెలుపు కట్టబెట్టడం, 2019లో బండి సంజయ్ ను గెలిపించడం.. ఇలా గత 20 ఏళ్లలో కరీంనగర్ ప్రత్యేకతే వేరు. మళ్లీ ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది.
దిలాసాగా బండి సంజయ్
ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లలో ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించినవి బీజేపీ, బీఆర్ఎస్ మాత్రమే. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎంతకూ కరీంనగర్ అభ్యర్థిని తేల్చలేకపోతోంది. వెలమ సామాజిక వర్గాన్నికి చెందిన వెల్చాల రాజేందర్ రావును అభ్యర్థిగా నిలిపి.. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను ఓడించాలని ఓ ఆలోచన చేస్తోంది. ఇది కాక ఆఖరికి తీన్మార్ మల్లన్నను నిలపాలని కూడా యోచిస్తోంది. ఈ కథ ఎంతకూ తేలడం లేదు. ఇక బీజేపీ నుంచి బండి సంజయ్ అభ్యర్థిత్వం ఎప్పుడో ఖరారైంది. ఆ పార్టీ తొలి జాబితాలోనే సంజయ్ కు టికెట్ కేటాయించారు. ఆయన తనదైన శైలిలో ప్రచారం కూడా మొదలుపెట్టారు.
చిక్కుల్లో బీఆర్ఎస్?
కరీంనగర్ బరిలో అభ్యర్థిని నిలిపినా.. బీఆర్ఎస్ పరిస్థితి ఏమంతా సానుకూలంగా లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు. సాక్షాత్తు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఇంకా చాలామంది నేతలు బీఆర్ఎస్ ను వీడుతున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు కారు పార్టీని బలహీనం చేస్తోంది. అన్నిటికిమించి ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు మరింత ఇబ్బందికర పరిస్థితిని కల్పించింది. దీంతోనే బోయినపల్లి వినోద్ కుమార్ ను కరీంనగర్ నుంచి నిలిపినా విజయావకాశాలు కచ్చితం అని చెప్పలేని పరిస్థితి.
తీన్మార్ మల్లన్నతో సాగేదెవరు?
కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పాలనను తీవ్రంగా ఎండగట్టి వెలుగులోకి వచ్చిన తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీకి దిగుతానంటూ హల్ చల్ చేశారు. చివరకు కాంగ్రెస్ కు మద్దతు పలికారు. అయితే, టికెట్ మాత్రం తెచ్చుకోలేకపోయారు. మాజీ మంత్రి మల్లారెడ్డి విజయానికి పరోక్షంగా కారకులయ్యారు. సువర్ణావకాశం చేజార్చుకున్న మల్లన్న ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, నల్లగొండ జిల్లాకు చెందిన ఈయన కరీంనగర్ కు స్థానికేతరుడు. ఈ కోణంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా స్వీకరిస్తాయో చెప్పలేని పరిస్థితి.
మున్నూరు కాపు ఓట్లు చీల్చాలనే కుట్ర?
మల్లన్నను కరీంనగర్ అభ్యర్థిగా నిలపడం ద్వారా కాంగ్రెస్ పరోక్షంగా బీఆర్ఎస్ కు మేలు చేయాలని చూస్తోందా? నియోజకవర్గంలో 2.70 లక్షల ఓట్లున్న మున్నూరు కాపులను చీల్చడం ద్వారా సంజయ్ ను ఓడించాలనే కుట్ర సాగుతోందా? పరిస్థితులను చూస్తుంటే దీనికి ఔననే సమాధానమే వస్తోంది. బండి సంజయ్ కు పోటీగా కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న దింపనుండడం ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు సంజయ్ ఇప్పటికే మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఆ కథే వేరుగా ఉండేది. ఇప్పుడు ఉన్న మోదీ వేవ్ లో సంజయ్ గనుక వరుసగా రెండోసారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయం. ఆ తర్వాత ఆయనను కట్టడి చేయడం బీఆర్ఎస్, కాంగ్రెస్ కు సాధ్యం కాని పని. అందుకే పార్టీ సిద్ధాంతాలు, విభేదాలను పక్కనపెట్టి సంజయ్ ను ఓడించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రితో బేరం..
సంజయ్ ను ఢీకొట్టడం వెల్చాల రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్నతో కాదు అనుకున్నారో ఏమో.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మాజీ మంత్రిని తమ పార్టీలో చేర్చుకునే ఆలోచనకు వచ్చింది. అంతేగాక ఆయనకు టికెట్ కూడా ఇవ్వాలని చూస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఈ మాజీ మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న కేసులో బాధితుడు కావడం గమనార్హం.ఆ కేసును చూపించి ఈ మాజీ మంత్రి నుంచి వివాదాస్పద అధికారి రూ.10 కోట్లు దండుకున్నట్లు చెబుతుంటారు. ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోవడంతో మాజీ మంత్రికి కాస్త స్వేచ్ఛ లభించినట్లైంది. అందుకే ఆయన కూడా ఆ పార్టీని వీడాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏం జరిగినా సంజయ్ కే లాభం
మాజీ మంత్రి అధికార కాంగ్రెస్ నుంచి పోటీకి దిగి ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే సంజయ్ మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన హవా తిరిగి మొదలవుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్