విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47”
“ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” చిత్రీకరణ ప్రారంభం
ఆకట్టుకుంటున్న “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” ఫస్ట్ లుక్
Victory Venkatesh and word wizard Trivikram come together for “Adarsha Kutumbat House No: 47”
తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రానున్న చిత్రం కోసం సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే వీరి కలయిక, ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
వెంకటేష్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ లోగోని గమనిస్తే.. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రంలో ఉత్కంఠ రేకెత్తించే అంశాలు కూడా ఉంటాయని అర్థమవుతోంది.
“ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్ లుక్‌లో క్లాస్ గా కనిపిస్తున్నారు. హృదయాన్ని తాకే భావోద్వేగాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రాబోతోందనే సంకేతాన్ని ఫస్ట్ లుక్ ఇస్తోంది. ఈరోజు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ మొదలైంది. వెంకటేష్-త్రివిక్రమ్ కలయిక మరోసారి ప్రేక్షకులందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.
వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచి చిత్ర పరిశ్రమతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. పైగా త్రివిక్రమ్ శైలి భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలను మేళవిస్తూ తెరకెక్కించే చిత్రంలో వెంకటేష్ నటిస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. వెంకటేష్ తో కలిసి, ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని త్రివిక్రమ్ అందిస్తారనే అంచనాలు ఉన్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్, త్రివిక్రమ్ కలయిక కావడంతో ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ అద్భుత కలయిక తెరపై ఏ మాయ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో వెండితెరపై వినోదాల విందుని అందించడానికి సిద్ధమవుతున్నారు.


