విజయవాడ: విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం సైంధవ్ విడుదలకు రెడీ అవుతోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం అయ్యాయి. ఈ మూవీ టీజర్ తో పాటు ఓ పాట కూడా విడుదల అయ్యాయి. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.తాజాగా సైంధవ్ సినిమాలోని రెండో పాటను చిత్రబృందం ఇవాళ విడుదల చేయనుంది. ఈ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం సినిమా యూనిట్ బెజవాడకు వెళ్లింది. ఈ సందర్భంగా అందరూ కలిసి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శకుంచుకున్నారు. టీమ్‌తో కలిసి వెంకటేష్ ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో వెంకటేష్ తోపాటు హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్, దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాతలు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సుల అనంతరం సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కి వెళ్లారు. ప్రస్తుతం ఆలయ దర్శనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విజయవాడకు వెళ్లిన విక్టరీ వెంకటేష్, ఒక్కడే బాబాయ్ హోటల్‌కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. సడెన్ గా కారులో నుంచి దిగి వచ్చి హోటల్ టిఫిన్ చేస్తున్న వారిని పలకరించారు. ఇక్కడ ఏ టిఫిన్ బాగుంటుంది? నన్ను ఏం తినమంటారు? అని అడిగారు. వెంకటేష్ అక్కడికి రావడంతో అందరూ అవాక్కయ్యారు. అక్కడున్న వాళ్లు ఇడ్లీ తినమని చెప్పడంతో, అందరితో కలిసి కూర్చొని ఇడ్లీ తింటూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.



