చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపాటు
విశాఖపట్టణం, సెప్టెంబర్ 21 ,
Vijayasai Reddy’s anger against Chandrababu
విశాఖలో జీవీఎంసీ అధికారులు మరోసారి అక్రమ కట్టడాల కూల్చివేతలపై దృష్టి సారించారు. భీమీలిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. CRZ నిబంధనల విరుద్ధంగా నిర్మాణాల చేపట్టారంటూ హైకోర్టు ఆదేశాలతో మరోసారి జీవీఎంసీ కూల్చివేతలను చేపట్టింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె చేపట్టిన నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. CRZ నిబంధనలను ఉల్లంఘించి సముద్రతీరంలో హోటల్ నిర్మాణానికి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు.అక్రమ నిర్మాణాల అంశంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం నిర్మాణాలను కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేయటంతో అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు.. కూల్చివేతలపై విజయసాయిరెడ్డి స్పందించారు. రాజకీయ కక్షలతో ప్రహరీ గోడను కూల్చటం పిల్ల చేష్ట అని ట్వీట్ చేశారు. కరకట్టపై ఉన్న నివాసాన్ని కూల్చమని గతంలో చాలాసార్లు కోరామని.. కానీ టీడీపీ నేతలు మాత్రం స్పందించలేదని X వేదికగా సాయిరెడ్డి ట్వీట్ చేశారు.వైజాగ్ ఎంపీ శ్రీ భరత్, మంత్రి నారా లోకేష్ లు కుమ్మక్కై.. రాజకీయ కక్షతోనే రెండోసారి ప్రహరీని కూల్చివేశారని ట్వీట్ లో పేర్కొన్నారు. కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నాయుడు అక్రమంగా కట్టుకుని ఉంటున్న ఇంటిని కూల్చమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. దానిని మాత్రం పట్టించుకోలేదని వాపోయారు. చంద్రబాబునాయుడు నిజంగా నిఖార్సైన నాయకుడే అయితే.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
“- తిరుమల వెయ్యికాళ్ల మండపం ఎందుకు కూల్చావు.
– విజయవాడలో 50కు పైగా గుళ్ళు ఎందుకు కూల్చావు.
– దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఎందుకు చేసావు.
– బూట్లు వేసుకుని ఎందుకు పూజలు చేస్తావు.
– రాష్ట్రంలో విగ్రహాలు ధ్వసం చేసి మాపై నిందలు ఎందుకు వేశావు.
– పవిత్రమైన ప్రసాదం లడ్డు మీద ఎందుకు విషప్రచారం చేసావు.
– నీలాంటి దుర్మార్గుడిని బహిష్కరిస్తే గానీ సమాజం బాగుపడదు.
– ప్రసాదం స్వీకరించే ప్రతి భక్తుడు నిన్ను చీ కొడుతున్నాడు.
– ప్రసాదంలో ఏ కల్తీ లేదు, కల్తీ అంతా నీ బుర్ర, మనసు నీ చరిత్ర, నీ మానసిక రుగ్మత.
– ఆరోపణలే తప్ప నీ జీవితం లో నిరూపణలు వుండవు.
– బట్ట కాల్చి ముఖానవేసి ప్రత్యర్థిని తుడుచుకో అంటావు.
– నీ అధికారం నీ డబ్బు సంపాదన కోసమే తప్ప ప్రజలకోసం మాత్రం కాదు.
– ఆ డబ్బుతో వ్యవస్థలను మానేజ్ చేస్తావు.
– విలువలకు ఎన్నడో వలువలు ఊడ్చిన నువ్వు ఒక మనిషివేనా!
– దేవదేవుడు నిన్ను ఎప్పటికి క్షమించడు.
– కలియుగంలో నీ అంత పాపం ఎవరూ చేసి ఉండరు.
– నీ ప్రవర్తనతో రావణాసురుడు, కంసుడు, కీచకుడు సిగ్గుపడేలా చేశావు.
– నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టం.”