జిల్లాలో కరవు పరిస్థితిపై పరిశీలన
అనంతపురం: అనంతపురం జిల్లాలో కేంద్ర బృందం కరువు పరిస్థితిపై పరిశీలన చేస్తోంది. రూరల్ పరిధిలోని కందుకూరు గ్రామంలో, ఆత్మకూరు మండలం తలపూరు గ్రామంలో ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీం సభ్యులు పర్యటించి కరువు పరిస్థితిపై పరిశీలన చేశారు. ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీం లీడర్ పంకజ్ యాదవ్, ఐ.ఏ.ఎస్. (జాయింట్ సెక్రెటరీ, డి.ఏ.ఎఫ్.డబ్ల్యూ), జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీం సభ్యులు .పొన్నుస్వామి, మహేష్ కుమార్, కైలాష్ శంక్ల, తదితరులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముందుగా అనంతపురం రూరల్ పరిధిలోని కందుకూరు గ్రామంలో రైతు ఏ.నారాయణప్పకు చెందిన కంది పంటను పరిశీలించి రైతులతో సమావేశం నిర్వహించారు. అక్కడ రైతులు అల్లు నారాయణప్ప, చిన్న వెంకటప్ప తదితరులతో ఏ ఏ పంటలు సాగు చేశారు, ఎంత నష్టం వాటిల్లింది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించగా, కందుకూరుకు చెందిన ఏ.రామలింగయ్య, చియ్యేడు గ్రామానికి చెందిన పి.రవీంద్ర రెడ్డి, రామకృష్ణ, బండిల గ్రామానికి చెందిన త్రిలోక్ నాయుడు, నరసమ్మ అనే రైతులు పంట సాగు, పంట ఖర్చు, నష్టం వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు వారి శాఖ పరిధిలోని నివేదికలను తెలిపారు. తదనంతరం ఆత్మకూరు మండలం తలపూరు గ్రామంలో కంది పంట నష్టం వివరాలను ఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీం సభ్యులు పరిశీలించారు.



