Sunday, September 8, 2024

కులాలతో ఓటు రాజకీయం

- Advertisement -
  • మైనారిటీలను మెప్పించాల్సిందే!
  • గెలుపోటముల్లో కీలకంగా మైనారిటీలు
  • ఇదే కారణంతో టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యానికి డిమాండ్‌
  • ఇప్పటికే మైనారిటీలకు గాలం వేస్తున్న పార్టీలు
  • రూ. లక్షల సాయం ప్రకటించిన అధికార బీఆర్‌ఎస్‌
  • మైనారిటీ డిక్లరేషన్‌ దిశగా కాంగ్రెస్‌

    Vote politics with castes
    Vote politics with castes

హైదరాబాద్‌: ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఎన్నికల సమయంలో కుల రాజకీయాలకు ప్రాధాన్యం ఉంటుందనేది అందరూ ఒప్పుకుని తీరాల్సిన విషయం. అన్ని వర్గాలకు మా పార్టీలో ప్రాధాన్యం ఇస్తుందని చెప్పే నాయకులు.. ఎన్నికల సమయంలో మాత్రం.. కుల రాజకీయాలకు తెరదీస్తారనే మాటలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోవలో ఇప్పుడు అన్ని పార్టీలు మైనారీటీ వర్గాలను ఆకర్షించేందుకు.. వారి ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో.. రానున్న ఎన్నికల్లో మైనారిటీలు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

పది శాతంపైగా ఓట్లు.. అందుకే ప్రాధాన్యం

రాష్ట్రంలో మైనారిటీ వర్గానికి పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణంగా వినిపిస్తున్న మాట.. ఆ వర్గానికి చెందిన ప్రజలు 12 నుంచి 13 శాతం మధ్యలో ఉండడమే. దీంతో.. ఎన్నికల్లో ఒక్క శాతం కూడా గెలుపోటములను శాసిస్తున్న తరుణంలో మైనారిటీ వర్గాన్ని అక్కున చేర్చుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అంతేకాకుండా.. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను దాదాపు 20కు పైగా నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లే జయాపజయాలను నిర్దేశించే స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్టీలు.. మైనారిటీల వైపు అడుగులు వేసేందుకు కారణంగా నిలుస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌.. అధికారిక గాలం.. రూ. లక్ష సాయం

మైనారిటీ వర్గాలను ఆకట్టుకునే క్రమంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే ఒక అడుగు ముందు ఉందని చెప్పొచ్చు. పాలక పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌.. మైనారిటీలకు కూడా.. రూ. లక్ష సాయం అందించే పథకానికి కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బీసీ కుల వృత్తి దారులకు రూ. లక్ష సాయం మాదిరిగానే.. మైనారిటీలకు కూడా రూ. లక్ష సాయం అందించనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆమేరకు వెనువెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిగా బీసీ బంధు తరహాలోనే నిబంధనలు రూపొందించారు. అంతేకాకుండా.. లబ్దిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీని ద్వారా తమ ప్రభుత్వం మైనారిటీల వెంటే ఉంటుందని చెప్పిన కేసీఆర్‌.. ఎన్నికల సమయంలో వారి ఓట్లను తమ పార్టీకి మళ్లించుకునే వ్యూహంలో భాగంగా వ్యవహరించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మైనారిటీలంటే ముస్లిం వర్గీయులే కాకుండా క్రిస్టియన్స్, జైనులు, బౌద్ధ మతస్తులు ఇలా అన్ని వర్గాలకు ఈ సాయం అందిస్తామని చెప్పడం ద్వారా భారీగా ఓటు బ్యాంకును సొంతం చేసుకునే వ్యూహానికి తెరదీశారు.

దూరం చేసుకున్న కాంగ్రెస్‌

మరోవైపు రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ మాత్రం.. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి మైనారిటీలను దూరం చేసుకుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్‌ చరిత్రను పరిశీలిస్తే.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో మైనారిటీ వర్గాలను ముఖ్యంగా ముస్లిం వర్గాలకు సానుకూల భావన ఉండేది. వారికి చట్ట సభల్లో ప్రాతినిథ్యం పెంచాలనే ఉద్దేశంతోనే ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వారికి ఏడు నియోజకవర్గాలు లభించేలా అప్పటి వైఎస్‌ఆర్‌ పావులు కదిపారనే అభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటి ఫలితంగానే అప్పటి వరకు నాలుగు స్థానాలకే పరిమితమైన ఎంఐఎం.. తర్వాత నుంచి ఏడు స్థానాల్లో జెండా ఎగురేస్తోంది. అయితే.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తలెత్తిన పరిణామాలతో.. మైనారిటీ వర్గాలు ముఖ్యంగా ముస్లింలు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. గత ఎన్నికల్లో కేవలం తొమ్మిది స్థానాల్లోనే మైనారిటీ వర్గాలుకు టికెట్లు కేటాయించడం ఆ వర్గంలో కాంగ్రెస్‌ పట్ల వ్యతిరేకతకు కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డిక్లేరషన్‌ల పేరుతో డ్యామేజ్‌ కంట్రోల్‌ దిశగా

రానున్న ఎన్నికలు కాంగ్రెస్‌కు చావో రేవోఅన్న రీతిగా మారిన పరిస్థితుల్లో మైనారిటీ వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌ శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఆగస్ట్‌ 15న ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ గర్జన సభ నిర్వహించాలని.. దీనికి మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారని ఇటీవల పార్టీ నిర్వహించే పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ డిక్లరేషన్‌ ద్వారా మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు, నిరుద్యోగుల కోసం ప్రత్యేక పథకాలను హామీలుగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉన్నత విద్య అవకాశాల్లోనూ ఈ వర్గానికి సముచిత ప్రాధాన్యం లభించేలా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాని రీతిలో ప్రత్యేక విధానాలు రూపొందించే అవకాశం కనిపిస్తోంది. వీటిని తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచి ఆ వర్గం ఓట్లను ఆకట్టకుకోవాలని, విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అధికార బీఆర్‌ఎస్‌లోనూ అంతంతమాత్రమే

మైనారిటీ వర్గాలను ముఖ్యంగా ముస్లిం వర్గాలకు చట్ట సభల్లో ప్రాతినిథ్యం కల్పించే విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా అంతంతమాత్రంగానే వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు మాత్రమే ముస్లిం వర్గ నేతలకు టికెట్‌ కేటాయించగా.. వారిలో ఒక్కరు మాత్రమే గెలిచారు. అయితే ఎమ్మెల్సీల విషయంలో ముగ్గురుకి అవకాశం ఇవ్వడం, ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనా మహమూద్‌ ఆలీకి హోం మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తమకు ఆ వర్గం అంటే అభిమానం ఉందనే సంకేతాలు పంపడంలో కొంత వరకు సక్సెస్‌ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఎంఐఎం పట్ల కూడా సానుకూల ధోరణి, మిత్రత్వం నేపథ్యంలో మైనారిటీలకు బీఆర్‌ఎస్‌ ప్రాధాన్యం ఇస్తుందనే అభిప్రాయం కొంత వరకు కనిపిస్తోంది. అయితే.. ఈ వర్గాలకు చెందిన విద్యావేత్తలు, మేధావులు మాత్రం.. తమకు ఆశించిన స్థాయిలో ఏ పార్టీ కూడా ప్రాధాన్యం ఇవ్వట్లేదని అంటున్నారు.

తెరపైకి ముస్లిం జేఏసీ

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఈసారైనా తమకు సముచిత స్థానం లభించాలనే ఉద్దేశంతో ఇటీవల ముస్లిం ఆర్గనైజేషన్స్‌ జేఏసీ పేరిట.. ఈ వర్గానికి చెందిన అందరు ప్రముఖులు ఒక సంఘంగా ఏర్పాటు అయ్యారు. అంతేకాకుండా.. జేఏసీ డిక్లరేషన్‌ పేరుతో పలు డిమాండ్లను రాజకీయ పార్టీల ముందుంచారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా.. ప్రతి జిల్లా నుంచి ఒక్కో స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వీటితోపాటు.. లోక్‌సభ టికెట్ల కేటాయింపులోనూ జనాభా దామాషా ప్రాతిపదికగా తమకు టికెట్లు కేటాయించాలనే డిమాండ్‌ తెరపైకి తీసుకొచ్చారు. దీనివల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆ పార్టీకి ఖాయంగా కనిపించే ఏడు నియోజకవర్గాలను కలిపితే.. అసెంబ్లీలో తమ ప్రాతినిథ్యం 18 స్థానాలకు పెంచుకోవాలనే వ్యూహంతో ముస్లిం మేధావులు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వర్గం ప్రజలు కేవలం కొన్ని నియోజకవర్గాలకే పరిమితం కావడం.. మిగతా చోట్ల వారి సంఖ్య తక్కువగా ఉండడంతో అన్ని జిల్లాల్లో టికెట్లు ఇచ్చే విషయంలో పార్టీలు సంశయిస్తున్నట్లు తెలుస్తోంది.

vote-politics-with-castes
vote-politics-with-castes

ఇలా ఎన్నికల వేళ ఒక్కో వర్గం.. తమ సాధికారిత దిశగా డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్న తరుణంలో తాజాగా ముస్లిం వర్గాల జేఏసీ డిమాండ్ల విషయంలో ప్రధాన పార్టీలు ఎలా వ్యవహరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్