పాటలనే నమ్ముకున్నాం… పార్టీలు కాదు
హైదరాబాద్, ఫిబ్రవరి 16, (వాయిస్ టుడే )
We believed in songs...not parties
సింగర్ మంగ్లీ ఎట్టకేలకు స్పందించారు. అరసవెల్లి దేవాలయంను ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి మంగ్లీ సందర్శించారు. ఈ సంధర్భంగా సోషల్ మీడియాలో తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకు మద్దతుగా పాటలు పాడేందుకు విముఖత చూపిన మంగ్లీకి ఇన్ని మర్యాదలా అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. రోజురోజుకు మంగ్లీ లక్ష్యంగా ట్రోలింగ్స్, విమర్శలు ఎక్కువ కావడంతో అసలు విషయాన్ని మంగ్లీ బయటకు చెప్పేశారు.మంగ్లీ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. అరసవల్లి దేవాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి దర్శనంపై చాలా మంది విమర్శించడం బాధ కలిగించిందన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపి కి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాటపాడానని, దాని తర్వాత రెండు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేసినట్లు మంగ్లీ అంగీకరించారు. ఆ నియోజకవర్గాలలో తనకు వ్యక్తిగతంగా నాయకులు తెలిసినందునే, తాను ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. కానీ ప్రచారంలో పాల్గొన్నా ఎవరినీ ఒక్క మాట కూడా విమర్శించలేదని మంగ్లీ వివరించారుతాను ఎక్కడా కూడ వైసీపీ జెండా మోయలేదని, అలాగే ఏ పార్టీ కండువాను కప్పుకోలేదని మంగ్లీ అన్నారు. అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాటలు పాడాను, వైఎస్సార్సీపి ఒక్కటే కాదు, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడానన్నారు. కాని అప్పటికే తనపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు పాటలు పాడే ఛాన్స్ దూరమయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చాలా అవకాశాలు కోల్పోయానని, అవమానాలు కూడా ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు.2024 ఎన్నికల సమయంలో వైసీపీ కి పాటలు పాడాలని పిలుపు వచ్చినా, తాను సున్నితంగా తిరస్కరించినట్లు మంగ్లీ అన్నారు. ఒక కళాకారిణిగా గుర్తించి ఎస్వీబిసి ఛానల్ సలహాదారురాలిగా నియమిస్తున్నట్లు ఛానల్ అధికారులు తనను సంప్రదించారన్నారు. తాను ఆ పదవి స్వీకరించాలా వద్దా అని చాలా రోజులు తర్జన భర్జన పడినట్లు, ఇది రాజకీయ పదవి కాదని, అప్పటికే చాలా మంది కళాకారులు సలహాదారులుగా చేశారని తన శ్రేయోభిలాషులు సూచించారని ఆమె వివరించారు. మా ఇంటి ఇలవేల్పు శ్రీవారి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఆ పదవిని కొనసాగించానే తప్ప ఎక్కడా బహిరంగంగా ఆ పదవి గురించి ప్రకటించుకోలేదన్నారు మంగ్లీ.తాను పాటను నమ్ముకునే వచ్చాను కాని పార్టీలను, పదవులను నమ్ముకొని రాలేదని మంగ్లీ తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడును తాను ఎక్కడా అనని మాటలను, ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలీకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ది కోసం ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, టీడీపీకి తాను పాట పాడను అన్న మాట ముమ్మాటికి వాస్తవం కాదని మంగ్లీ ప్రమాణం చేసి చేశారు. మొదట్లో వైసీపీకి పాడిన కారణంగానే, 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరూ కూడ సంప్రదించలేదని తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంతపెద్ద మనిషిని తాను అంతమాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా ? 2019 ఎన్నికల్లోని వీడియో క్లిప్పులతో రాజకీయపార్టీలకు ముడిపెట్టి విష ప్రచారం చేయడం సమంజసమా అంటూ ప్రశ్నించారు.ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయటం చాలా బాధాకరంగా ఉందని, ఎలాంటి రాజకీయ అభిమతాలు కాని, పక్షపాతాలు కాని లేవు, నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కానంటూ మంగ్లీ తేల్చి చెప్పారు. అందరు నాయకులపై గౌరవం ఉందని, ప్రతి ఒక్కరూ తనకు ఆదర్శనీయులని, తాను హాజరయ్యే కార్యక్రమాలు కేవలం కళాదృష్టితోనే చూడమని వేడుకుంటున్నట్లు మంగ్లీ ప్రకటన సారాంశం. మరి ఇప్పటికైనా ట్రోలింగ్స్ కి ఎండ్ కార్డు పడేనా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.