ఏడుకొండల స్వామికి క్షమాపణ చేయాల్సిందే
విజయవాడ, ఫిబ్రవరి 5
We must apologize to the Lord of the Seven Hills.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని కల్తీ పామాయిల్ మాత్రమే వాడారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇది ఈ ఒక్కరోజు ఆలోచన కాదని చాలా కాలం క్రితమే పుట్టిందని అనుమానం వ్యక్తం చేశారు. వీళ్లంతా ఏడు కొండలవాడిపై పగ బట్టారని ఆరోపించారు. తిరుమలేశుడికి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలనే వాదన నుంచి వచ్చిన వాళ్లకు మన ధర్మంపై ఎలాంటి గౌరవం ఉంటుందని ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వరకు దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు పవన్. విగ్రహాల తలలు తీసేశారని, వస్తువులు దొంగిలించారని అన్నారు. వాటి గురించి ప్రశ్నిస్తే పిచ్చోళ్లు, ఆకతాయిలు చేశారంటూ బుకాయించారని తెలిపారు. వస్తువుల గురించి ప్రశ్నిస్తే పోతే ఏమైపోతుందని తిరిగి నిలదీశారని గుర్తు చేశారు. ఇలా ప్రతి సందర్భంలో వారిని వారు సమర్థించుకున్నారే తప్ప చర్యలు తీసుకోవాలనే ఆలోచన వారికి రాలేదని చెప్పారు. అలాంటిదే కల్తీ నెయ్యి విషయంలో జరిగిందని వివరించారు. 2022లోనే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడుతున్న విషయం వెలుగులోకి వచ్చిందని పవన్ చెప్పారు. అయినా ఆ రిపోర్టును తొక్కిపెట్టి ఆ అపచారాన్ని కంటిన్యూ చేశారని మండిపడ్డారు. ఇందులో వేరే మతస్తుల ప్రమేయం లేదని పవన్ చెప్పారు. లక్షల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. కల్తీ పామాయిల్‌తో చేసిన లడ్డూలనే అయోధ్య రాముడి ఆలయానికి కూడా పంపించారని మండిపడ్డారు. ఇప్పటి వరకు వచ్చి అన్ని రిపోర్టుల్లో లడ్డూల్లో వాడినది అసలైన నెయ్యి కాదని చెబుతున్నాయని పవన్ తెలిపారు. అయితే దాన్ని పట్టించుకోకుండా తమకు క్లీన్ చిట్ ఇచ్చేశారని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా తాము క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఇది ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. వీళ్లకు పూర్తిగా దేవుడిపై నమ్మకం లేదని, ధర్మంపైనే విశ్వాసం లేదని ఆరోపించారు. అందుకే ఇలాంటి అడ్డగోలు వాదన చేస్తున్నారని అన్నారు. ఇందులో తాము రాజకీయాలు చేయడం లేదని పవన్ వివరించారు. రాజకీయం చేయాలనుకుంటే ఎన్నికల టైంలో ఇలాంటి అంశాలు బయటకు చెప్పేవాళ్లమని అన్నారు. కానీ వచ్చిన రెండు నెలలకే దీన్ని ఎందుకు బయట పెడతామని ప్రశ్నించారు. గతంలో దేవాలయాలపై జరిగిన దాడుల విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామే తప్ప, రాజకీయంగా వాడుకోవాలని లేదన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేది లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో ఉన్న వారందర్నీ దోషులుగా న్యాయస్థానం ముందు, ప్రజల ముందు నిలబెడతామన్నారు. జరిగిన తప్పునకు క్షమాపణలు చెప్పకుండా క్లీన్ చిట్ ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిష్ ఆయిల్, జంతు కొవ్వులు కలిసి అవకాశం ఉందని కూడా రిపోర్టుల్లో ఉందని తెలిపారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. ఎంతో ఆలోచించి ఈ విషయాన్ని ప్రజల ముందు ఉంచామనిపేర్కొన్నారు. ఈ విషయంలో అందరం ఒకే నిర్ణయంపై ఉన్నామని, ఈ తప్పు చేసిన వారంతా ఏడు కొండ స్వామికి క్షమాపణలు చెప్పే వరకు వదిలి పెట్టేది లేదన్నారు. భగవంతుడి ముందు వారందరూ మోకరిల్లేలా చేస్తామని స్పష్టం చేశారు.



