- Advertisement -
మాకో ఇల్లు కావాలి
We need a home
పొలిటికల్ సినిమా స్టార్ట్..
హైదరాబాద్, డిసెంబర్ 20, (వాయిస్ టుడే)
ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం తెలంగాణ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తే.. పనులు ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇల్లుకు రూ.5 లక్షలు ఇవ్వనుంది. దీంతో మరికొన్ని డబ్బులు కలిపి ఇల్లు కట్టుకోవాలని చాలామంది ఆశగా ఉన్నారు. అటు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఈ సర్వే తర్వాత లబ్ధిదారుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. బాగానే ఉన్నా.. అసలు పొలిటికల్ సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ నాయకుల ఇళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇండ్ల కోసం ఎదురుచూసేవారు కాంగ్రెస్ లీడర్ల చుట్టూ తిరుగుతున్నారు. అన్నా.. మనకో ఇల్లు మర్చిపోకే.. అంటూ ఎక్కడ కలిస్తే అక్కడ గుర్తు చేస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో.. లీడర్లు కూడా ఆచితూచి మాట్లాడుతూ.. తమవారి కోసం పైరవీలు చేస్తున్నారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కమిటీల ఏర్పాటు పూర్తయ్యింది. కానీ.. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. గ్రామాల విషయం పక్కనబెడితే.. పట్టణాల్లో ఈ కమిటీలో కౌన్సిలర్లు, కార్పోరేటర్లు కీలకంగా మారారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే చాలామంది కౌన్సిలర్లుగా ఉన్నారు. కొన్నిచోట్ల బీజేపీ వారు ఉన్నారు. కమిటీల్లో వారు ఉండటాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారిపై పైచేయి సాధించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.కొన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. అలాంటి చోట కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు కాంప్రమైజ్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. తాను కౌన్సిలర్ కాబట్టి.. తమ అనుచరులకు కొన్ని, అధికారం మీది కాబట్టి మీకు కొన్ని అని ఇండ్లను పంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తొలి దశలో తక్కువ ఇండ్లు వస్తున్నాయి. లబ్ధిదారులు ఎక్కువమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఇండ్ల కోసం నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.చాలాచోట్ల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సమస్యగా మారబోతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కమిటీల ఏర్పాటు విషయంలోనే గొడవలు అయ్యాయి. కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు కమిటీల్లో చోటు ఇవ్వడంపై ఘర్షణలు జరిగాయి. అలాంటి పంచాయితీలు కలెక్టర్ల దగ్గరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే కమిటీలు ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.ఇప్పటికే అన్ని జిల్లాల్లో యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. 30 – 35 ప్రశ్నల ఆధారంగా వివరాలను సేకరించి.. ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తున్నారు. అన్ని కోణాల్లో వివరాలను క్రోడీకరించి అసలైన అర్హులకే స్కీమ్ ను వర్తింపజేయనున్నారు. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. గ్యారెంటీ పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో వీటి వడపోత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ గా మారింది.
- Advertisement -