బీసీ రిజర్వేషన్లు 42% సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం:ఎంపీ వద్దిరాజు
We will continue to fight until BC reservations reach 42%: MP Vaddiraju
వెనుకబడిన కులాల సంక్షేమం, అభ్యున్నతికి 42% రిజర్వేషన్స్ సాధించే వరకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.బీసీలతో పాటు బడుగు, బలహీన, అల్పసంఖ్యాక వర్గాలు,మహిళల సాధికారత కోసం బీఆర్ఎస్ ఆలోచిస్తుందని, ఎల్లవేళలా వారి పక్షాన నిలబడుతున్నదన్నారు.చట్టసభలలో మహిళలు,బీసీలకు 33% చొప్పున రిజర్వేషన్స్ అమలు చేయాలని కోరుతూ మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ఏర్పాటు జరిగిన తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి పంపారని ఎంపీ రవిచంద్ర వివరించారు.హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శుక్రవారం ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్,తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఆర్డినెన్స్ పేరుతో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేదే ఉంటే,అది అంత చులకైనదే అయితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే చేసుండే వారేనన్నారు.ఆ ముఖ్యమంత్రులకు అది తెలియదా? రేవంత్ రెడ్డికే తెలివుందా?అని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు.రిజర్వేషన్స్ పెంపుదల విషయంలో ఆర్డినెన్స్ వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదని,న్యాయస్థానాలు కొట్టివేస్తాయని రేవంత్ రెడ్డికే కాదు, అందరికీ తెలిసిందేనన్నారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరో ఒకరితో కోర్టులో కేసు వేయించి ఆర్డినెన్స్ కొట్టుడుపోయేలా చేసి బీసీలను మభ్యపెట్టడానికే రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు.కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మోసపు మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.ఇప్పటికే రాష్ట్రపతి వద్ద బిల్లు ఉండగా,అదే అంశంలో తిరిగి ఆర్డినెన్స్ తీసుకువస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.ఇది బీసీలను మరోసారి మభ్యపెట్టడం,మోసం,దగా చేయడమే తప్ప మరొకటి కాదని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.మంత్రిమండలిలో మున్నూరుకాపు,యాదవ, ముస్లిం, లంబాడీలకు స్థానం కల్పించకపోవడం,కార్పోరేషన్ల ఛైర్మన్ల నియమాకం జరపకుండా,నిధులివ్వకుండాపేద,బడుగు, బలహీన వర్గాలకు పాలకులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఎంపీ రవిచంద్ర ఆవేదన చెందారు. బీసీలకు మంచి జరగాలని,న్యాయం చేయాలనే ఆలోచన, చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ప్రధాని నరేంద్రమోడీ వద్దకు తీసుకుపోవాలని ఎంపీ వద్దిరాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.బీసీలకు రాజకీయ, విద్యా,ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్స్ కల్పించే బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశానుసారం రాజ్యసభలో తాము సంపూర్ణ మద్దతునిస్తామన్నారు.రిజర్వేషన్ల పెంపుదలకు చట్టబద్ధత లభించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని, అందుకోసం బీసీలందరిని ఏకతాటిపైకి తెచ్చి బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తూనే ఉంటుందని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.



