ఎల్బీనగర్ లో బీఎస్పీ జెండాను ఎగరవేస్తాం: ఎల్బీనగర్ బీఎస్పీ అభ్యర్థి గువ్వల సాయికృష్ణ ముదిరాజ్
బహుజనుల అభివృద్ధికి బీఎస్పీ కృషి
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
ఎల్బీనగర్ నియోజకవర్గంలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్లు ఉన్నారని, వారి ఓట్లతో బీఎస్పీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఎల్బీనగర్ గడ్డపై బీఎస్పీ పార్టీ జెండాను ఎగరవేయడం ఖాయమని ఎల్బీనగర్ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల సాయికృష్ణ ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ జైపూరికాలనీలోని తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గువ్వల సాయికృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో కేవలం రోడ్లను బాగు చేసి ఓట్లు అడగడానికి అధికార పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వస్తున్నారని, కేవలం రోడ్లను బాగు చేసినంత మాత్రాన నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెందినట్లు కాదని అన్నారు. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. బీఎస్పీ చేస్తున్న పోరాటాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ గెలుపొందడం ఖాయమని తెలిపారు. దీపావళి పర్వదినం సందర్భంగా ఆదివారం నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. ఇప్పటికే బీఎస్పీ పార్టీకి ప్రజల నుండి ఎనలేని ఆదరణ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.