Sunday, September 8, 2024

వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం: కేసిఆర్

- Advertisement -

వరంగల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసిఆర్ వరంగల్

తెలంగాణ చరిత్రకు సాక్షిభూతం వరంగల్. ఉద్యమంలో వరంగల్ కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం ఉంది. అభ్యర్థుల గుణాలు, పార్టీ చరిత్ర ఏందో చూడాలి. వరంగల్ లో ఎవరు గెలిస్తే ఆ ప్రభుత్వం ఏర్పాటు అయితదని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం అయన వరంగల్ ప్రజాఅశిర్వాద సభలో మాట్లాడారు.

ఇంతకుముందు వరంగల్ లో మంచినీళ్లకు హరిగొస  ఉండేది. ఇప్పుడు మంచినీళ్ల సమస్య లేదు. ఆజంజాహీ మిల్లును గత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంది. వరంగల్ లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసాము. రాబోయే రోజుల్లో లక్షన్నర ఉద్యోగాలు వస్తాయని అన్నారు. దుమ్ము ధూళి ఉన్న వరంగల్ ఇప్పుడు అభివృద్ధి చెందింది. హెల్త్ యూనివర్సిటీ కాళోజి పేరుతో ఇక్కడే ఏర్పాటు చేశామని అన్నారు. కుడా అధ్వర్యంలో వరంగల్ మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. వరంగల్ అభివృద్ధి మొదలైంది, ఆగేది లేదు. 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కడుతున్నమని అన్నారు. ఆటో రిక్షాలు టాక్స్ లు రద్దు చేసాము. ఆటో డ్రైవర్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం. వరంగల్ తూర్పు, పశ్చిమలో బీసీ అభ్యర్థులను నిలబెట్టాము. బీసీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదేనని అయన అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు వరంగల్‌ పట్టణమే వేదిక

తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతం

వరంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య మంత్రి కెసిఆర్

 హుస్నాబాద్‌ టూ గజ్వేల్‌.. 96 ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లు

ముగిసిన ప్రచార ఘట్టం

వరంగల్‌ నవంబర్ 28:  తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఉన్న ఈ వరంగల్ వీరభూమికి తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆఖరి రోజైన మంగళవారం వరంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు వరంగల్‌ పట్టణమే వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ఉద్యమంలో అతి భారీ బహిరంగ సభ ఈ వరంగల్‌ నగరంలోనే జరిగిందని, భద్రకాళీమాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నమని అన్నారు. అమ్మవారికి కిరీట ధారణ చేసి తాను మొక్కు కూడా చెల్లించుకున్నానని తెలిపారు.ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘అన్నింటికన్నా మించి వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఏందంటే.. రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టడం, చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి మిషన్‌ కాకతీయ అని పేరు పెట్టడం. ఇది కాకతీయ రాజులకు తెలంగాణ ప్రజలు అర్పించిన నిజమైన నివాళి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను ఉద్యమాన్ని తలకెత్తుకున్న సందర్భంలో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజాకవి కాళోజీ గారిని, నాకు ఆ రోజు అండగా నిలిచిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ గారిని నేను మనఃపూర్వకంగా స్మరించుకుంటున్నా. ఈ సందర్భంగా నేను చెప్పేదేందంటే ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలె. మీరు వేసే ఓటు తెలంగాణతోపాటు వరంగల్‌ ఈస్ట్‌, వెస్ట్‌ నియోజకవర్గాల ఐదేండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తది. కాబట్టి అసుంటి ఓటును ఆషామాషీగా వేయవద్దు. మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి వేయాలె. అప్పుడే మంచి జరుగుతది. కాబట్టి మీ గ్రామాలల్లో బాగా చర్చించి, మంచి పార్టీ ఏదో, మంచి అభ్యర్థి ఎవరో తేల్చుకుని ఓటేయాలె’ అని సూచించారు.‘కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అరాచకాలు జరిగినయ్‌. తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చిచంపిండ్రు. ఎమర్జెన్సీ పెట్టి అందర్నీ జైళ్లల్ల పెట్టిండ్రు. అసుంటి రాజ్యం మళ్ల గావాల్నా..? కాంగ్రెస్‌ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏండ్లు మనలను గోసపెట్టింది. కొట్లాడంగ, కొట్లాడంగ ఆఖరికి తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ ఏర్పడంగనే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఆసరా పెన్షన్‌లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతబంధు, రైతుబీమా లాంటి పథకాలు తీసుకొచ్చినం. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తాము నిర్ణయాలు చేసినం’ అని చెప్పారు.

హుస్నాబాద్‌ టూ గజ్వేల్‌.. 96 ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లు

కాగా ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారాన్ని కైవ‌సం చేసుకునే దిశ‌గా బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు త‌న ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కొన‌సాగించారు. ఎలాంటి విరామం లేకుండా, రోజుకు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ, ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొని ప్ర‌సంగించారు కేసీఆర్. అలా ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కేసీఆర్ 96 ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొని రికార్డు సృష్టించారు.ఈసారి కూడా బీఆర్ఎస్సే అధికారంలోకి రాబోతుందని, గ‌తంలో కంటే అధిక సీట్ల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని బీఆర్ఎస్ శ్రేణుల్లో, ప్ర‌జ‌ల్లో విశ్వాసం నింపారు కేసీఆర్. కాంగ్రెస్ గెలిచేది లేదు, స‌చ్చేది లేదు.. ఆ పార్టీ గెలిస్తే డ‌జ‌న్ మంది ముఖ్య‌మంత్రులు ఉన్నారని ఎద్దెవా చేస్తూ కేసీఆర్ త‌న ప్ర‌చారాన్ని కొన‌సాగించారు.

అక్టోబ‌ర్ 15వ తేదీన హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించారు. ఆ రోజు నుంచి నేటి దాకా అలుపెర‌గ‌కుండా.. ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొని బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను, ప్ర‌జ‌ల‌ను చైత‌న్యప‌రిచారు. దీపావ‌ళి పండుగ నేప‌థ్యంలో ప్ర‌చారానికి ఓ మూడు రోజుల పాటు విరామం ప్ర‌క‌టించారు. అనంత‌రం ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండ‌కుండా కేసీఆర్ రోజులు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌చారం నిర్వ‌హించారు.ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఈ ప‌దేండ్ల కాలంలో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. రాష్ట్ర ప్ర‌గ‌తికి అడ్డుపడ్డ ప్ర‌తిప‌క్షాల‌ను ఎండ‌గ‌డుతూ.. వారి హ‌యాంలో ఎలాంటి మోసం జ‌రిగిందో ప్ర‌జ‌ల‌కు విడ‌మ‌రిచి చెప్పారు కేసీఆర్. రైతుబంధు, ధ‌ర‌ణి, 24 గంట‌ల కరెంట్, ద‌ళిత‌బంధు వంటి అంశాల‌ను కేసీఆర్ ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఇవ‌న్నీ మాయ‌మవుతాయ‌ని, వారు అదే విష‌యాన్ని బ‌హిరంగంగా చెబుతున్నార‌ని కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అంతేకాకుండా ఎన్నో ఏండ్లుగా ద‌గా ప‌డ్డ ద‌ళిత జాతిని అభివృద్ధి చేసేందుకు ద‌ళిత‌బంధు తీసుకొచ్చామ‌న్నారు. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒకే విడుత‌లో ద‌ళిత‌బంధు తీసుకొస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇక గిరిజ‌నుల‌కు కూడా పోడు ప‌ట్టాలిచ్చి వారికి రైతుబంధు అందేలా చేశామ‌న్నారు.

ఇందిర‌మ్మ రాజ్యం అని ప్ర‌చారాన్ని కొన‌సాగించిన కాంగ్రెస్ పార్టీపై కూడా కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇందిర‌మ్మ రాజ్యం అంటేనే ఆక‌లి రాజ్యం, ఎమ‌ర్జెన్సీ, ఎన్‌కౌంట‌ర్లు, ర‌క్త‌పాతం జ‌రిగాయ‌ని కేసీఆర్ గుర్తు చేశారు. ద‌ళితులు, గిరిజ‌నుల‌ను ప‌ట్టించుకోలేద‌ని, వారిని ఓటు బ్యాంకుగానే చూశార‌ని కాంగ్రెస్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందిర‌మ్మ రాజ్యం స‌క్క‌గా ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయాల‌కే కిలో బియ్యం ఎందుకు ఇచ్చార‌ని, రామారావు ఆ బియ్యం ఇవ్వ‌డంతోనే పేద‌ల క‌డుపు నిండింద‌ని కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు విడ‌మ‌రిచి చెప్పి, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు.ఇక ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా, స్థానికంగా కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాల‌ను కేసీఆర్ బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్, నిజామాబాద్, మెద‌క్ లాంటి జిల్లాల్లో ప‌రిశ్ర‌మల‌ను మూయించిందే కాంగ్రెస్ పార్టీ అని, కార్మికుల‌ను రోడ్డు న ప‌డేసిందే కాంగ్రెస్ నేత‌లు అని కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. నాణ్య‌మైన క‌రెంట్ ఇవ్వ‌కుండా రైతుల‌ను మోసం చేశార‌ని, ప‌రిశ్ర‌మ‌లు కూడా త‌ర‌లిపోయేలా చేశార‌ని కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ క‌రువుకు, వ‌ల‌స‌ల‌కు నిల‌యంగా మారింద‌ని సీఎం గుర్తు చేశారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌పై 196 కేసులు వేసి ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

ఈ దేశంలో జాతీయ పార్టీల‌కు స్థానం లేద‌ని, 2024 ఎన్నిక‌ల త‌ర్వాత ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జాతీయ పార్టీల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగం లేద‌ని, బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌బోతుంద‌ని కేసీఆర్ ప‌లు స‌భ‌ల్లో ప్ర‌క‌టించారు. బీఆర్ఎస్ పార్టీ వంద‌కు వంద శాతం సెక్యుల‌ర్ పార్టీ అని, బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంట్‌లో క‌ర్ఫ్యూ, మ‌త‌క‌ల్లోలాలు జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. దాని కార‌ణంగానే రాష్ట్రానికి వేల సంఖ్య‌లో పెట్టుబ‌డులు త‌ర‌లివ‌చ్చి, ల‌క్ష‌ల మంది ఉపాధి క‌ల్పించాయ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ‌కు ఒక్క మెడిక‌ల్ కాలేజీ, న‌వోద‌య పాఠ‌శాల ఇవ్వ‌ని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాల‌ని కేసీఆర్ ప్ర‌శ్నించారు.త‌న ప‌ర్యట‌న‌లో భాగంగా హెలికాప్ట‌ర్ల‌లో తిరుగుతూ రోజుకు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టివ‌చ్చారు కేసీఆర్. రెండు, మూడు సార్లు హెలికాప్ట‌ర్‌లో సాంకేతిక లోపం త‌లెత్తిన‌ప్ప‌టికీ కేసీఆర్ వెనుక‌డుగు వేయ‌లేదు. ఒక గంట ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ రోడ్డు మార్గం ద్వారా వెళ్లి ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొని, కార్య‌క‌ర్త‌ల‌ను, ప్ర‌జ‌ల‌ను ఉత్తేజ‌ప‌రిచారు. ఆ విధంగా కేసీఆర్ దాదాపు 45 రోజుల పాటు తీరిక లేకుండా బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొన్నారు.ఆనవాయితీ ప్రకారం న‌వంబ‌ర్ 4వ తేదీన సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో సీఎం కేసీఆర్ నామినేషన్‌ పత్రాలను స్వామి వారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూజలు నిర్వహించి నామినేషన్‌ పత్రాలను అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి శాసనసభకు వేసే(రెండు సెట్లు) నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. 9వ తేదీన ఉద‌యం గజ్వేల్‌లో, మ‌ధ్యాహ్నం కామారెడ్డిలో కేసీఆర్ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్