- Advertisement -
ఉప ఎన్నికల్లో సత్తా చూపిస్తాం
We will show our strength in the by-elections
హైదరాబాద్, సెప్టెంబర్ 11, (న్యూస్ పల్స్)
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ బుధవారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులును కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు వెలువరించిన తీర్పును వెంటనే అమలు చేయాలని సెక్రెటరీకి తెలిపారు. సమావేశం తర్వాత తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్‌తో పాటు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రెటరీకి వినతిపత్రం ఇచ్చామన్నారు వివేకానంద. అలా కాదని టైం పాస్ చేసేలా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలంటే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలపై పిటిషన్ స్పీకర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉందన్నారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపై తమకు గౌరవం ఉందని, ఆయన తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని దేశం మొత్తం రాహుల్ గాంధీ చెప్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అరికెపూడి గాంధీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు.హైకోర్టు తీర్పు తర్వాత బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని, వారిని రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్‌కు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు వివేకానంద. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తథ్యమని, పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనేలా ఉందని సెటైర్లు వేశారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు వస్తాయని తెలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని అన్నారు.
పూటకో పార్టీ మారే దానం నాగేందర్ బిచ్చగాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతారని, కడియం శ్రీహరి పచ్చి మోసగాడు అంటూ మండిపడ్డారు. పొద్దున కేసీఆర్ దగ్గర బ్యాగులు తీసుకుని వెళ్లి సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. అరికెపూడి గాంధీ తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని అంటున్నారని, మాట మార్చారని మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయం దాకా ఆగకుండా ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని సవాల్ చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ పది సీట్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు కౌశిక్ రెడ్డి. కేసీఆర్ విడిగా ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కేసీఆర్ హయాంలో బీఆర్‌ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం జరిగిందని స్పష్టం చేశారు. అరికెపూడి గాంధీ తమ పార్టీ సభ్యుడు అయితే తెలంగాణ భవన్‌కు రావాలని అన్నారు.
- Advertisement -