హైదరాబాద్, జూలై 27, (వాయిస్ టుడే): జాతీయ రాజధాని ఢిల్లీలోని అధికారలపై మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తోంది. ఢిల్లీలో ప్రజలకు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండాల్సిన అధికారాలను కేంద్రం లాక్కుంటోందని చాలా కాలం నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీన్ని అందరూ వ్యతిరేకించాలని అన్ని పార్టీలను, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేజ్రీవాల్ అభ్యర్థించారు. తెలుగు రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. వైసీపీ మాత్రం కేంద్రానికి మద్దతుగా నిలిచింది. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న వేళ ఆప్ ఎంపీలు అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.
కేంద్రం తీసుకువస్తున్న సవరణ బిల్లును వ్యతిరేకించాలని కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ ఎంపీలకు దీనిపై జగన్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో చెప్పారు. బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రాలు ఏకం కావాలని ఆప్ చేసిన విజ్ఞప్తి గురించి మీడియా అడిగినప్పుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రంగా ఉంటే తాము వారికి మద్దతు ఇచ్చేవాళ్లం. ఈ సందర్భంలో ఇది పూర్తి రాష్ట్రం కాదు, అందులోని చాలా ప్రాంతాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాక ముందు నుంచి కూడా కేంద్రానికి వైసీపీ అనుకూలంగానే ఉంది. అవసరమైనప్పుడల్లా బీజేపీకి మద్దతుగా నిలుస్తోంది. ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉంటే రాజ్య సభలో 9మంది సభ్యులు ఉన్నారు. “సమాఖ్య నిర్మాణం గురించి మాట్లాడితే గతంలో కాంగ్రెస్ కూడా చాలాసార్లు ఉల్లంఘించిందని” వైఎస్ఆర్ ఎంపీలు గుర్తు చేస్తున్నారు. వైసీపీ ప్రకటనతో ఎన్డీఏకు రాజ్యసభలో సంఖ్యాబలం పెరిగింది. 237 మంది పార్లమెంటు సభ్యుల సభలో ఓటు వేయాల్సి ఉండగా, ప్రతిపక్ష కూటమికి వచ్చే 108 ఓట్లకు వ్యతిరేకంగా ఎన్డీయేకు 123 ఓట్ల మెజారిటీ ఉంది. ఇందులో 92 మంది బీజేపీ ఎంపీలు, వారి భాగస్వాములైన అన్నాడీఎంకే సహా ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి. తొమ్మిది మంది ఎంపీలతో బిజూ జనతాదళ్ కూడా ఎన్డీయేకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. వచ్చేవారం పార్లమెంట్‌లో ఢిల్లీ అధికారాలకు సంబంధించిన బిల్లు రాగానే వ్యతిరేకంగా ఓటు వేయాలని భారతీయ రాష్ట్ర సమితి బీఆర్‌ఎస్ తన 7 మంది ఎంపీలకు విప్ జారీ చేసింది. పార్లమెంటు సభ్యులందరూ జూలై 26, 27, 28 తేదీల్లో సభలో ఉండాలని బిల్లుపై ఓటింగ్ ముగిసే వరకు సభలోనే ఉండాలని విప్‌లో ఆ పార్టీ సూచించింది. ఢిల్లీలో బ్యూరోక్రసీపై కేంద్రం నియంత్రణ ఉండేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన బిల్లు ముసాయిదాను మే 19న కేంద్రం కేబినెట్ ఆమోదించింది. పోలీసు, పబ్లిక్ ఆర్డర్, భూమికి సంబంధించిన విషయాలు మినహా రాజధానిలో బ్యూరోక్రసీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ఇచ్చింది. దాన్ని సమర్థిస్తూ సవరణ బిల్లు సిద్ధం చేసింది. దాన్ని వచ్చే వారం ఆమోదానికి సభ ముందు పెట్టబోతోంది.