- బలహీనమే తప్ప.. బలి కాదు! రేవంత్ వ్యూహం వెనుక రాజకీయ చదరంగం
హైదరాబాద్, మార్చి 24, (వాయిస్ టుడే )
Weak, Perhaps… But Not a Sacrifice! The Political Chess Game Behind Revanth’s Strategy
తెలంగాణ రాజకీయంలో అందరినీ తొలుస్తున్న ఏకైక ప్రశ్న గులాబీ బాస్‌ల అరెస్టు ఎప్పుడు? . గడప దాటిన ప్రతిచోటా, ప్రతి మీడియా సమావేశంలోనూ రేవంత్ రెడ్డికి ఎదురయ్యే ఈ ప్రశ్న వెనుక ఒక ఉత్కంఠ ఉంది. దానికి కారణం గతంలో రేవంత్ పై కేసీఆర్ చేసిన రాజకీయమే. అయితే, రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేస్తుంది అనే వ్యూహమే పాటిస్తున్నారు. దీని వెనుక ఒక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. ప్రత్యర్థులను జైలు పాలు చేయడం ద్వారా తక్షణ రాజకీయ మైలేజీ పొందడం కంటే, వారిని రాజకీయంగా నిరాయుధులను చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారుఅరెస్టు అనేది రెండు అంచుల కత్తి. ఒక నాయకుడిని జైలుకు పంపడం ద్వారా అతడిని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టాలని అనుకుంటే, అది ఒక్కోసారి అతడిని రాజకీయ బాధితుడి గా మార్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్ వంటి నేతల్ని అరెస్టు చేస్తే, అది సోషల్ మీడియా యుగంలో అనూహ్యమైన సానుభూతిని నింపుతుంది. అక్రమ కేసులు పెట్టారనే ప్రచారం జరిగితే, అది బీఆర్ఎస్కు సంజీవనిలా మారుతుందని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే, ఆవేశంతో సంకెళ్లు వేయడం కంటే, ఆధారాలతో వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడమే మేలని ఆయన భావిస్తున్నారు. కాళేశ్వరం వైఫల్యాలు, ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను ప్రజల్లో నిరంతరం చర్చ జరిగేలా చూడటం ద్వారా వారి నైతిక పతనాన్ని శాశ్వతం చేయడమే రేవంత్ అసలు వ్యూహం.తెలుగు నేల రాజకీయ చరిత్ర రేవంత్ రెడ్డి ముందు స్పష్టమైన పాఠాలను ఉంచింది. గతంలో జగన్మోహన్ రెడ్డి 16 నెలల జైలు జీవితం ఆయనకు ప్రజల్లో ఒక విధమైన సానుభూతిని, తద్వారా అధికారాన్ని తెచ్చిపెట్టింది. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కూడా ప్రజల్లో వెల్లువెత్తిన మద్దతు, సానుభూతి పవనాలు రాజకీయ సమీకరణాలను మార్చేశాయి. కేసీఆర్ వంటి ప్రాంతీయ సెంటిమెంట్ ఉన్న నాయకుడిని అరెస్టు చేస్తే, అది మళ్లీ తెలంగాణ ఆత్మగౌరవం అనే సెంటిమెంట్‌ను రాజేసే అవకాశం ఉంది. తన పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం పగ తీర్చుకుంటున్నారనే ముద్ర పడకుండా, రేవంత్ రెడ్డి అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.నిజానికి కేటీఆర్‌ను చట్టపరమైన చిక్కుల్లో నెట్టే అవకాశాలు వచ్చినా రేవంత్ ఆచితూచి అడుగు వేయడం వెనుక ఉన్న పక్కా పొలిటికల్ లెక్క ఇదే. జైలు గోడల మధ్య ప్రత్యర్థిని ఒక పొలిటికల్ హీరోగా మార్చడం కంటే, బయటే ఉంచి వారిపై ఉన్న ఆరోపణలను ఎండగట్టడం ద్వారా వారి విశ్వసనీయతను దెబ్బతీయడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. జైలుకు వెళ్తే వచ్చే సానుభూతి కంటే, బయట ఉండి సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడటం వల్ల కలిగే నష్టమే ప్రత్యర్థికి ఎక్కువ. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే ఆయన కేవలం ఒక దూకుడున్న నాయకుడిగానే కాకుండా, రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏ పావును కదపాలో తెలిసిన పరిణతి చెందిన నాయకుడిగా కనిపిస్తున్నారు.మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యూహం స్పష్టంగా ఉంది. ప్రత్యర్థులను జైలులో ఉంచి బలవంతులుగా మార్చడం కంటే, వారి తప్పులను ప్రజల ముందు ఉంచి బలహీనపరచడమే సరైన మార్గమని ఆయన నమ్ముతున్నారు. ఈ వేచి చూసే ధోరణి కాంగ్రెస్ కేడర్‌కు కొంత అసహనం కలిగించినా, దీర్ఘకాలంలో ఇది పార్టీకి మేలు చేస్తుందని ఆయన రాజకీయ లెక్కలు చెబుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులకు సానుభూతి మైలేజీ ఇవ్వకుండా, చట్టపరమైన ప్రక్రియ ద్వారానే అంతిమ తీర్పు వచ్చేలా చూడటం రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ అనుకోవచ్చు



