గర్శకుర్తి గ్రామంలో చేనేత కార్మికుల వంటావార్పు
-8వ రోజుకు చేరిన చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్ష
చొప్పదండి
Weaver’s kitchen
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో గురువారం చేనేతకార్మికులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్లు అందించి తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ చేనేత, పవర్ లూమ్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 8 వ రోజుకు చేరింది. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలోని బీటీ చౌరస్తాపై నేతకార్మికులు వంటావార్పు చేపట్టి రోడ్డుపై బైటాయించి సహఫంక్తి అల్పాహారం చేశారు. వస్త్ర ఉత్పత్తులు నిలిచి పవర్ లూమ్స్ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న తాము, తమ కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నామని నేతకార్మికులు ఆవేదన చెందారు. గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి ప్రత్యామ్యాయంగా ఏదేని గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు కల్పించక బతుకుదెరువు దినదిన గండంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ప్రభుత్వం గ్రామంలోని పవర్ లూమ్స్ పరిశ్రమకు ఎటువంటి వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు కల్పించక, మార్కెట్ లో ఉత్పత్తి చేసిన చీరలు అమ్మక నేతకార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలు పెరిగాయి. సీఎం, పాలకులు చొరవ తీసుకుని ఏదేని గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వకపోతే మళ్లీ పదేళ్ల కింద జరిగిన ఆకలిచావులు, ఆత్మహత్యలు పునరావృతం అవుతాయని నేతకార్మికులు వాపోయారు.పవర్ లూమ్స్ కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో వస్త్రోత్పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభ, ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ శ్రీనివాస్, కార్మిక సంఘం నాయకులు రేణికుంట శ్రీనివాస్, సామల శంకర్, కొలపాక తిరుపతి, అల్వాల శ్రీశైలం, మిట్టపల్లి వెంకటేష్, వావిలాల శ్రీనివాస్, బూర్ల శ్రీనివాస్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.