రేవంత్ ఆగ్రహం వెనుక… ఏంటీ
హైదరాబాద్, మార్చి 18, (వాయిస్ టుడే )
What's behind Revanth's anger?
మీ జర్నలిస్టు సంఘాలను నేను అడుగుతా ఉన్న. ఎవరు జర్నలిస్టో మీరే చెప్పండి. జాబితాలు తయారు చేయండి. ప్రభుత్వానికి అందించండి. మీ జాబితాలో లేని వ్యక్తులు ఎవరైనా జర్నలిస్టులమని చెబితే కఠిన చర్యలు తీసుకుంటాం. బట్టలిప్పి నడిబజార్లో నిలబెడతాం” ఇవీ శనివారం నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.అధికారాన్ని కోల్పోయిన తర్వాత భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాను మరింతగా బలోపేతం చేసింది. మెజారిటీ యూట్యూబ్ ఛానల్స్ ను భారత రాష్ట్ర సమితి హైర్ చేసుకుంది. పలు వెబ్ సైట్ లను కూడా నిర్వహిస్తోంది. యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్ లు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఇవి ఒక పరిధి వరకు ఉంటే బాగానే ఉండేది. కానీ జర్నలిజ ముసుగులో.. ఒక పార్టీకి డబ్బా కొట్టుకుంటూ.. చేస్తున్న వ్యవహారం ఏవగింపుగా మారింది. ఫలితంగా సోషల్ మీడియాను నియంత్రించాలనే డిమాండ్ తెరపైకి వస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వరంగల్ సభలో వేగంగా మీడియాను తొక్కేస్తా అని మాటలు మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు జర్నలిస్టులు ఎవరో చెప్పాలని జర్నలిస్టు సంఘాలను అడుగుతున్నారు. దీనిని బట్టి పాత్రికేయం ముసుగులో ఎంతటి విద్వేషం ప్రసారం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అధికారంలో ఉన్న వాళ్లకు ఈ నొప్పి తీవ్రత తెలియడంతో వారు స్వరం పెంచుతున్నారు. గతంలో కేసీఆర్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యక్తులు మాత్రమే మారారు..మీడియాకు లక్ష్మణ రేఖ కచ్చితంగా ఉండాలి. ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో జరిగిన వివాదంలో పాత్రికేయులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. జల్ పల్లి లో మోహన్ బాబు ఇంటి గేట్లు తీయడమే ఆలస్యం.. వెంటనే లోపలికి వెళ్లిపోయారు. దీంతో మోహన్ బాబు విచక్షణ కోల్పోయి ఓ విలేకరిని కొట్టాడు. ఈ విషయంలో మోహన్ బాబును సమర్ధించడం లేదు.. అలాగని విలేకరిని వెనకేసుకు రావడం లేదు. ఆ విలేఖరి వార్త ముసుగులో ఒక సెలబ్రిటీ వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టాలని చూడడం అత్యంత దారుణం. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక వ్యక్తిగత జీవితం అంటూ ఉంటుంది. అందులోకి ప్రవేశిస్తామంటే బయట వ్యక్తులకు ఇలాంటి సన్మానమే జరుగుతుంది. అది మోహన్ బాబు కావచ్చు.. కెసిఆర్ కావచ్చు.. రేవంత్ రెడ్డి కావచ్చు.. సోషల్ మీడియా ఉన్మాదం వల్ల పడుతున్న బాధ వారికి మాత్రమే తెలుసు. అయితే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా.. అధికార పక్షంలో ఉన్నప్పుడు మరొక విధంగా వారు వ్యవహరించడమే విధి వై చిత్రి. ఇప్పుడిక సోషల్ మీడియాను నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు లేదు. ఒకవేళ ఉన్నా నియంత్రణ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం ఒకరకంగా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. అలాంటప్పుడు కోరలు చాచిన సోషల్ మీడియాలో మార్పులు తీసుకురావడం పైనే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఇక జర్నలిస్ట్ ను ప్రభుత్వం గుర్తించే విషయంలోనూ అనేక నిబంధనలు ఈసారి తెరపైకి రావచ్చు. ఎందుకంటే శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అంత పదునుగా ఉన్నాయి మరి. దీనిపై విధి విధానాలు చర్చించడానికి త్వరలోనే ముఖ్యమంత్రి జర్నలిస్టు సంఘాల పెద్దలతో భేటీ అయ్యే అవకాశం కొట్టి పారెయ్యలేనిది.