- Advertisement -
తిరుమల బోర్డు ఎప్పుడు…
When is Tirumala Board...
తిరుమల, అక్టోబరు 23, (వాయిస్ టుడే)
కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచిపోతున్నాయి. ఇంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నియామకం జరగలేదు. కనీసం స్పసిఫైడ్ అథారిటీని కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో టీటీడీ చరిత్రలో మొదటి బ్రహ్మోత్సవాలు అధికారుల పర్యవేక్షణలో సాగాయి.త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. తిరుమలపై గత నెల మీడియాతో మాట్లాడుతూ బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారన్నారు. టీటీడీ పాలక మండలిలో.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 దేవాలయాలు పాలక మండళ్లను అతి త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు.అది చెప్పి నెల గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలు టీటీడీ పాలక మండలి ప్రస్తావనే రావడం లేదు.టీటీడీ చరిత్రలో పాలకమండలి లేకుండా బ్రహోత్సవాలు జరగడం ఇదే మొదటి సారి అంటున్నారు. పాలకమండలి లేకపోతే కనీసం స్పెసిఫైడ్ అథారిటీ ఆఫ్ టీటీడీని నియమిస్తారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగిసినప్పుడు అదే చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు.టీటీడీ పాలకమండలి చైర్మన్ పదవికి ఎంత డిమాండ్ ఉంటుందో.. పాలకమండలి సభ్యులకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. 2019లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొంత కాలానికే టీటీడీ పాలక మండలిని నియమించారు. అప్పటి వరకు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 19 మందిగా ఉన్న బోర్డు సభ్యుల సంఖ్యను 25కు పెంచుతూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ పాతిక మందితో సరిపెట్టకుండా టీటీడీ పాలక మండలికి జంబో జాబితాను జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు ల నుంచి పలువురు ప్రముఖులకు టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే పలు ఆరోపణలు ఎదుర్కొన్న వారికి, గతంలో వైసీపీ నేతలు విమర్శలు గుప్పించిన వారికి సైతం పక్క రాష్ట్రాల పెద్దల ఒత్తిడితో స్థానం కల్పించింది.పాలక మండలి సభ్యుల ఎంపికే వివాదం కాగా , ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మరింత మందిని పాలకవర్గంలో చేర్చి వారితో ప్రమాణ స్వీకారం చేయించటం కూడా అప్పట్లో దుమారం రేపింది. ఇప్పుడా లెక్కలన్నీ సరిచేసి టీటీడీ సంప్రదాయం ప్రకారం పాలకమండలిని నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారంట. అయితే ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో ఉండటంతో టీటీడీ బోర్డు సభ్యత్వాల కోసం ఒక రేంజ్లో ఒత్తిడి పెరిగిపోతుందంట.అసలు రాష్ట్రంలో కూటమి సర్దుబాట్లే ముఖ్యమంత్రి పెద్ద తలనొప్పిగా మారాయంటున్నారు. టీటీడీ బోర్డు సభ్యత్వాల కోసం టీడీపీ వారితో పాటు జనసేన నేతలు పోటీ పడుతున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే జనసేన నుంచి పాతిక మంది ఆశావహుల జాబితా చంద్రబాబు ముందుకు చేరిందంటున్నారు. మరోవైపు బీజేపీ పరంగా ఇటు రాష్ట్ర నాయకుల నుంచి , అటు కేంద్ర పెద్దల నుంచి ఎంత ఒత్తిడి ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు.ఇటు చూస్తే కొండ మీద లడ్డు కల్తీపై విచారణ వంటి వివాదాలు నడుస్తున్నాయి.. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురు కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ బోర్డు తేనెతుట్టెను కెలికి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని ముఖ్యమంతి చంద్రబాబు సైలెంట్ అయ్యారంటున్నారు. ఎలాగూ బ్రహోత్సవాలు అయిపోయాయి కాబట్టి నిదానంగా చూద్దాంలే అన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తుందంటున్నారు.
- Advertisement -