ఆ నలుగురు ఇప్పుడెటూ…
విజయవాడ, జూలై 16
ఏపీలో రాజకీయాలకు, సినిమా రంగానికి దగ్గర సంబంధం ఉంటుంది. 1983లో టిడిపి ఆవిర్భావంతో.. తెలుగు సినీ పరిశ్రమ సైతం రాజకీయాల వైపు మళ్ళింది. ప్రతి ఎన్నికల్లోను సినీ పరిశ్రమ ప్రభావం చూపింది. కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. మరికొందరు పార్టీలకు తమ మద్దతు ప్రకటించారు. ప్రచారం కూడా చేశారు. రాజ్యసభ, ఇతర నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న వారు ఉన్నారు. అయితేసినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు రాజకీయ విమర్శలకు దూరంగా ఉండేవారు. తాము ఉండే పార్టీకి ప్రచారం చేసుకునేవారు కానీ.. ప్రత్యర్థి పార్టీలపై హద్దులు దాటి విమర్శలు చేయలేదు. అయితే గత ఐదేళ్ల వైసిపి హయాంలో .. చాలామంది నటులు రాజకీయ విమర్శలు చేశారు. వారి పరిస్థితి ఇప్పుడు ఏంటి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.సినీ రంగం నుంచి రోజా అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. సుదీర్ఘకాలం టిడిపిలో కొనసాగారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో నగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. అయితే ఆమె మెగా కుటుంబాన్ని నిత్యం టార్గెట్ చేసేవారు. అయితే ఆమెకు సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరించేవారు. ప్రత్యేక కార్యక్రమాల్లో కనిపించేవారు. కానీ మంత్రి అయ్యాక టీవీ షో నుంచి కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతుల్లో సినిమాలు లేవు. టీవీ షోలు కూడా అవకాశం దక్కే ఛాన్స్ కనిపించడం లేదు.వైయస్ కుటుంబానికి వీర విధేయుడు పోసాని కృష్ణ మురళి. చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో చిరంజీవితో కూడా కలిసి పని చేశారు. కానీ తర్వాత జగన్ పార్టీ పెట్టడంతో అటువైపు మొగ్గు చూపారు. మెగా కుటుంబం పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పై సైతం విపరీత కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడం, పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో.. పోసానికి తప్పకుండా సినిమాలు తగ్గుతాయని తెలుస్తోంది. అనవసరంగా వివాదాలు కొని తీర్చుకోవడం ఏంటని నిర్మాతలు పోసానికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉండదని తెలుస్తోంది.వైసీపీకి సపోర్ట్ చేశారు కమెడియన్ అలీ. కానీ ఎన్నడూ రాజకీయ విమర్శలు చేసే వారు కాదు. ప్రత్యర్థులను టార్గెట్ చేసిన సందర్భాలు కూడా లేవు. కేవలం వైసీపీ కోసం మాట్లాడేవారు. ఈ ఎన్నికల్లో ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. వైసిపి ఓడిపోవడంతో.. ఇక తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని.. ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని ప్రత్యేక ప్రకటన ఇచ్చారు. సో ఆలీ కి కొంత ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. ఆయన చేతిలో సినిమాలతో పాటు టీవీ షో కూడా ఉంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి గతంలో వైసిపికి పనిచేశారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం కూటమి వైపు నిలిచారు. కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. సో ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఏంటి లేవు.బుల్లితెర నటులు ఈసారి క్రియాశీలక పాత్ర పోషించారు. జనసేన తో పాటు కూటమికి ప్రచారం చేశారు. హైపర్ ఆది, కిరాక్ ఆర్పి తదితరులు శ్రమించారు. కిరాక్ ఆర్పి అయితే రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టేవారు. ఆయన చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యేవి. ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత కూడా కిరాక్ ఆర్ పి ఓ రేంజ్ లో విమర్శలకు దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన బుల్లితెర ప్లాట్ఫామ్ పైలేరు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆయన విమర్శల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు యాంకర్ శ్యామల మాత్రం అడ్డంగా బుక్కయ్యారు. పిఠాపురంలో పవన్ ఓడిపోతున్నారని, ఏవేవో కథలు కూడా అల్లుతూ వైసిపి అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆమె కెరీర్ కు తప్పకుండా ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అయితే పవన్ డిప్యూటీ సీఎం కావడంతో సినీ పరిశ్రమ సంతోషంతో ఉంది. కానీ ఆ నలుగురు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయంగా తెలుస్తోంది.